భారత్పై బంగ్లాదేశ్ ఘనవిజయం
మిర్పూర్: ఢాకాలో గురువారం ఇక్కడ భారత్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో బంగ్లాదేశ్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ భారత్పై మొత్తం నాలుగు వన్డేలు గెలిచింది. అయితే బంగ్లా జట్టు నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 228 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో వీరాట్ కోహ్లీ (1), ధోనీ (5) సింగల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, జడేజా మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు.
అంతకమందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు భారత్ జట్టుకు 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు సర్కార్, తమీమ్ ఇక్బాల్లు ధాటిగా ఆడి తొలి వికెట్కి 102 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో సర్కార్, తమీమ్ ఇక్బాల్లు వేగంగా ఆడి జట్టు స్కోరుని పరుగులు పెట్టించారు. సర్కార్ 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)చేసి రనౌట్గా వెనుదిరిగాడు. తర్వాత వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగింది.
తిరిగి మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు(62 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్) చేసి అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వెనువెంటనే వికెట్లు కోల్పోయిన బంగ్లాను షకీబ్, రహమాన్లు బాధ్యతాయుతంగా ఆడి తిరిగి గాడిలో పెట్టారు. రహమాన్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. షకీబ్(52) పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో నాసిర్ హొస్సేన్(34) భారీషాట్కి యత్నించి క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్లు వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించి వెనువెంటనే ఔటయ్యారు. దీంతో బంగ్లా 49.4 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.