శరణ్ సరికొత్త చరిత్ర!
హరారే:భారత పేస్ బౌలర్ బరిందర్ శరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. జింబాబ్వేతో రెండో టీ 20లో నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు సాధించడం ద్వారా శరణ్ అరంగేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయ బౌలర్ గా నిలిచాడు. తద్వారా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రంలో నమోదు చేసిన రికార్డును సవరించాడు. 2009లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఓజా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించాడు. కాగా ఆ మ్యాచ్లో ఓజా 21పరుగులివ్వడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఓవరాల్ టీ 20 అరంగేట్రం రికార్డులో మెరుగైన గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ గా శరణ్ నిలిచాడు. అంతకుముందు 2012లో ఐర్లాండ్ తో మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్ ఎలియస్ సన్నీ ఐదు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో పాటు ఒకే ఓవర్లలో మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా శరణ్ మరో ఘనతను సాధించాడు. 2012లో అశోక్ దిండా శ్రీలంకతో జరిగిన టీ 20లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు.