
ఊచకోత తప్పనుంది..
బ్యాటింగ్ పవర్ ప్లే రద్దు
సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు
నిబంధనలను సవరించిన ఐసీసీ
సాక్షి: టీ20 ప్రభావాన్ని తట్టుకుంటూ వన్డేలు ఆదరణ కోల్పోకుండా ఉండేందుకు ఐసీసీ నిర్దేశించిన రూల్స్ బౌలర్ల పాలిట శాపంలా మారాయి. మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారితేనే అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారని భావించిన క్రికెట్ పెద్దలు ఫీల్డింగ్‌పై పరిమితులు విధించారు. నిబంధనలు వచ్చిన కొత్తలో బాగున్నా.. రానురాను అవి విమర్శల పాలయ్యాయి. వన్డేల్లో బౌలర్లు కేవలం బ్యాట్స్‌మెన్‌కు బంతుల విసిరే యంత్రాల్లా మారిపోయారు.
వన్డేలలో కంటే టీ20ల్లో బౌలింగ్ చేయడమే బాగుంటుందని బౌలర్లు చెబుతున్నారంటే.. నిబంధనలు వారికి ఎంత ప్రతిబంధ కాల్లా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. 350కి పైగా పరుగులు సులభంగా చేయడం, పైగా ప్రత్యర్థి జట్టు ల క్ష్యాన్ని ఛేదించడం ఇప్పుడు పెద్ద కష్టమేమి కాదు. ఈ తీరుపై అభిమానులు కూడా పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదంటే వన్డేలు.. బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మరాయనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. నిబంధనలను సడలించాలని అన్ని జట్లు చేస్తున్న డిమాండ్లకు ఐసీసీ తలవంచింది. ఫీల్డింగ్ పరిమితులు, మిగిలిన నింబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్తగా వచ్చిన రూల్స్ పరిశీలిస్తే..
బ్యాటింగ్ పవర్‌ప్లే రద్దు..
నిజానికి వన్డేల్లో 2005 వరకు ఒకే పవర్ ప్లే ఉండేది. తొలి 15 ఓవర్ల పాటు 30 గజాల సర్కిల్ అవతల ఇద్దరు ఫీల్డర్లు మాత్రం ఉండాలనే నిబంధన అది. 2005లో ఈ పవర్ ప్లేను అలాగే ఉంచి మరో రెండింటిని అమల్లోకి తెచ్చారు. అవి బౌలింగ్ పవర్ ప్లే (బౌలింగ్ జట్టు కెప్టెన్ తీసుకుంటాడు), బ్యాటింగ్ పవర్ ప్లే (క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ తీసుకుంటారు). ఇవి రెండు ఐదేసీ ఓవర్లు ఉంటాయి. ఇవి ఆడుతున్నప్పుడు సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే ఈ రెండు పవర్ ప్లేలు 11-40 ఓవర్ల మధ్య మాత్రమే తీసుకోవాలని 2011లో రూల్ తెచ్చారు. 2012లో బౌలింగ్ పవర్ ప్లేను తీసేశారు. ఇప్పుడు బ్యాటింగ్ పవర్ ప్లేను రద్దు చేయడంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం కాస్త ఇబ్బందిగానే మారనుంది.
40-50 ఓవర్ల మధ్య ఫీల్డింగ్ సవరణలు..
నిజానికి పవర్ ప్లే మినహా మిగిలిన ఓవర్లలో సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు. అయితే టీ20 రాకతో వన్డేల్లో కూడా బౌండరీల మోత మోగించేందుకు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండాలనే నిబంధనను ఐసీసీ 2012లో తెచ్చింది. దీని వల్ల బ్యాట్స్‌మెన్ షాట్ ఆడేందుకు ఎప్పుడు ఏదో ఒక ఫీల్డర్ లేని ఖాళీ ఉండేది. ఫీల్డింగ్ కెప్టెన్, బౌలర్‌కు ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలనే దానిపై గందరగోళంగా ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధనను పూర్తిగా సవరించకపోయినా.. 40-50 ఓవర్ల మధ్యలో సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను మోహరించవచ్చనే రూల్ బౌలర్లకు ఊరటనే చెప్పవచ్చు.
క్యాచింగ్ పొజిషన్లు అవసరం లేదు..
ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లలో కనీసం రెండు క్యాచింగ్ పొజిషన్లలోనైనా ఫీల్డర్లు ఉండాలనే నిబంధన కూడా 2012లోనే తెచ్చారు. క్యాచింగ్ పొజిషన్లంటే.. స్లిప్, సిల్లీ పాయింట్, గల్లీ, లెగ్ స్లిప్, లెగ్ గల్లీ, షార్ట్ లెగ్ తదితర స్థానాలు. బ్యాట్స్‌మెన్ ఆడిన షాట్లను నేరుగా క్యాచ్ అందుకునే అవకాశం ఉన్న స్థానాలివి. ఇప్పుడు ఇద్దరు ఫీల్డర్లు ఉండాలనే నిబంధనను తొలగించారు.
నో బాల్ అయితే చాలు..
అయితే ఒక నిబంధన మాత్రం వారికి కాస్త ప్రతికూలంగా తీసుకున్నారు. ఇప్పటివరకు లెగ్ నోబాల్‌కు మాత్రమే ఫ్రీ హిట్ ఉండేది. ఇప్పట్నుంచి ఏ నోబాల్ కైనా ఫ్రీహిట్ ఉంటుంది. వన్డేలతో పాటు టీ20ల్లో కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం
1 - 10 ఓవర్లు: సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు
11 - 40 ఓవర్లు: సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు
40 - 50 ఓవర్లు: సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు
ఈ కొత్త నిబంధనలు జూలై 5 నుంచి అమల్లోకి వస్తాయి.