ముంబై: క్రికెట్ చరిత్రలో ఆఖరి బంతికి ఆరు కొట్టి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతేడాది నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ అవసరమైంది. కానీ, సిక్స్ కొట్టకుండానే ఆరు పరుగులు రావడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదర్శ్ క్రికెట్ క్లబ్(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 76 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దేశాయ్ ఒక్క బంతికి 6 పరుగులు కావాల్సివచ్చింది. ఇది ఐదు ఓవర్ల మ్యాచ్ కాగా, దేశాయ్ 4.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
అయితే, ఒకే బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండటంతో ఇరు జట్ల మధ్య తీవ్ర ఉత‍్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మొదటి బాల్ పడింది.. అది కాస్త వైడ్. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్!.. ఇలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక్కడ చదవండి: 35/3 నుంచి 35/10
Comments
Please login to add a commentAdd a comment