మళ్లీ టీమిండియా కోచ్ గా చేయండి!
ముంబై: టీమిండియాకు మరోసారి చీఫ్ కోచ్ గా పనిచేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి తనకు ఆహ్వానం అందినట్లు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తనకు బీసీసీఐ పెద్దల నుంచి ఒకటి-రెండు ఫోన్స్ కాల్స్ వచ్చినట్లు తెలిపాడు. కాగా, తాను ప్రస్తుతం కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనట్లు కిరెస్టన్ పేర్కొన్నాడు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ సాధించడంతో పాటు టెస్టుల్లో జట్టును నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత గ్యారీదే. టీమిండియా కోచ్ గా తనవంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించిన కిరెస్టన్.. ప్రస్తుతం కుటుంబానికి దగ్గరగా ఉంటూ క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే కిరెస్టన్ కు మరోసారి ఆ బాధ్యతలను అప్పజెప్పేందుకు గత కొంతకాలం నుంచి బీసీసీఐ యత్నాలు చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి కోచ్ గా చేయాలంటూ పిలుపు వచ్చిన విషయాన్ని కిరెస్టన్ వెల్లడించాడు.
'టీమిండియా జట్టుకు కోచ్ గా చేయాలని బీసీసీఐ కోరింది. నేను క్రికెట్ కు దూరంగా ఉంటూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ నేపథ్యంలో మరోసారి కోచ్ గా చేయడానికి సిద్ధంగా లేను. ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా ఉన్నప్పుడే టీమిండియా కోచ్ గా చేయాలని అడిగినా అందుకు తిరస్కరించాను' అని కిరెస్టన్ తెలిపాడు.
భారత్ క్రికెట్ కోచ్గా డంకెన్ ఫ్లెచర్ పదవీకాలం ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్తో ముగిసిన సంగతి తెలిసిందే. 2011లో టీమిండియా కోచ్గా నియమితుడైన జింబాబ్వే మాజీ క్రికెటర్ ఫ్లెచర్ నాలుగేళ్లు సేవలందించారు. ఫ్లెచర్ రిటైర్మెంట్ తర్వాత రవిశాస్త్రి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బోర్డు టీమ్ డైరెక్టర్గా రవిశాస్త్రి పదవీకాలాన్ని పొడిగించినా.. రాబోవు కాలంలో టీమిండియాకు ఒక ఫుల్ టైమ్ కోచ్ ను నియమిస్తే బావుంటుందని బీసీసీఐ భావిస్తోంది. దానిలో భాగంగానే కిరెస్టన్ తో సంప్రదింపులు జరుపుతోంది.