India coach
-
‘సచిన్ ఏడుస్తూనే ఉన్నాడు’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది గాయంతో బాధపడుతూనే అద్భుత బ్యాటింగ్‌తో విజయానికి చేరువగా తీసుకొచ్చి వెనుదిరిగితే, ఆపై జట్టు ఓటమిపాలైతే ఆ బాధ ఎలా ఉంటుంది... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1999లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఇలాంటి వేదనే అనుభవించాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం 271 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ బరిలోకి దిగింది. తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నా... సచిన్ 136 పరుగులతో చెలరేగాడు. అయితే నయన్ మోంగియా (52) మినహా సహచరులంతా విఫలం కావడంతో సచిన్ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. అయితే 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 4 పరుగులకే మిగిలిన 3 వికెట్లు కోల్పోయిన భారత్ చివరకు 12 పరుగులతో ఓడింది. దీనిని గుర్తు చేసుకుంటూ నాటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్... ‘సక్లాయిన్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ తిరిగి వచ్చాక సచిన్ నిరాశ పడ్డాడు. భారత జట్టు ఓడిపోయిందని తెలిసిన తర్వాత అతను బయటకే రాలేదు. ఒక టవల్‌ను అడ్డుగా పెట్టుకొని అతను ఏడుస్తూనే ఉన్నాడు. సచినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే అతను దానిని తీసుకునేందుకు వెళ్లలేదు. వేదికపైనున్న రాజ్‌సింగ్ దుంగార్పూర్ సచిన్ ఎక్కడ అంటూ అడిగినా అతని జాడే లేదు. బహుమతి ప్రదాన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా టెండూల్కర్ తన సీటులోనే స్తబ్దుగా ఉండిపోయాడు. చివరకు నేను సముదాయించాల్సి వచ్చింది. అతను ఇలా భావోద్వేగాలు ప్రదర్శించడం ఎప్పుడూ చూడలేదు’ అని నాటి ఘటనను వివరించారు. ప్రేక్షకుల మధ్య ఆడితే ఆ మజాయే వేరు ఏ ఆటలోనైనా ప్రేక్షకులు కూడా భాగమే. మీకు అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా వారి ప్రోత్సాహం, కేకలు క్రీడలో చాలా అవసరం. మైదానంలో ఖాళీ స్టేడియాల మధ్య ఆడటం క్రీడాకారులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ప్రేక్షకులకు ఆటగాళ్లు స్పందించే ఘటనలు కోకొల్లలు. నేను ఏదైనా మంచి షాట్ ఆడినప్పుడు ప్రేక్షకులు అభినందిస్తే మరింత ఊపు వస్తుంది. బౌలర్ కూడా అద్భుతమైన స్పెల్ వేసినప్పుడు అభిమానులు అభినందిస్తుంటే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. కరోనా తర్వాత ఆటలో సహజంగానే మార్పులు వస్తాయి. సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చు. ఇక బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మిని వాడాలంటే భయపడతారు. ఒకటి మాత్రం స్పష్టం. క్రికెట్ జరగాలని నేనూ కోరుకుంటాను. అయితే అంతా బాగుందని, ఆరోగ్యాలకు ప్రమాదం లేదని భావించినప్పుడే మళ్లీ ఆట మొదలు పెట్టాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిని దాటిన తర్వాతే ఐపీఎల్, టి20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం వీటిపై అసలు చర్చించడమే నా దృష్టిలో అనవసరం. –సచిన్ టెండూల్కర్ వేడుకలు లేవు... కోవిడ్–19 కారణంగా దేశంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోరాదని సచిన్ నిర్ణయించుకున్నాడు. ‘సంబరాలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతర సిబ్బందికి మనం అండగా నిలవడం మనందరికీ ముఖ్యమని అతను చెప్పాడు. సహాయనిధికి ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా ఇతర రూపాల్లో కూడా సహాయక కార్యక్రమాల్లో సచిన్ పాలపంచుకుంటున్నాడు’ అని అతను సన్నిహితుడొకరు వెల్లడించారు. మీకు తెలుసా... సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 989 మంది క్రికెటర్లతో కలిసి ఆడాడు. ఇందులో 141 మంది టీమిండియా సహచరులు కాగా... 848 మంది ప్రత్యర్థి జట్లకు చెందినవారు. -
సోదరుడే చాపెల్‌ను నమ్మలేదు
న్యూఢిల్లీ: కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ, కోచ్‌గా గ్రెగ్ చాపెల్ మధ్య విభేదాలు, అవి భారత క్రికెట్‌పై చూపిన ప్రభావం మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. కెప్టెన్సీతో పాటు, జట్టు నుంచి కూడా తప్పించడంపై గంగూలీ పలుసార్లు గ్రెగ్పై విమర్శలు చేశాడు. తాజాగా ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లోనూ గంగూలీ ఆ సంగతులను ప్రస్తావించాడు. భారత కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నియామకంపై అతడి సోదరుడైన ఇయాన్ చాపెల్ కూడా నాడు ఏమంత సానుకూలంగా లేడని చెప్పుకొచ్చాడు. ఆత్మకథలో ఇంకా ఏమన్నాడంటే... ‘2005లో ఈ ఉదంతంపై ఇయాన్‌తో పాటు సునీల్ గావస్కర్ కూడా నన్ను హెచ్చరించారు. అయినా వాటిని విస్మరించాను. అంతకుముందు తనతో జరిగిన భేటీల్లో విస్తృత క్రికెట్ పరిజ్ఞానంతో గ్రెగ్ నన్ను ఆశ్చర్యపరిచాడు. మన జట్టును నంబర్ వన్‌గా నిలిపేందుకు అతడు సరైనవాడని భావించాను. నా అభిప్రాయాన్ని దాల్మియాకు వివరించాను. కానీ గ్రెగ్‌తో మున్ముందు ఇబ్బందులు తప్పవని, అతడి కోచింగ్ రికార్డు గొప్పగా ఏమీ లేదని గావస్కర్ హెచ్చరించారు. అయినప్పటికీ నేను ముందుకెళ్లా. విజయవంతమైన కెప్టెన్‌ను, అంతకుముందు టెస్టు సిరీస్‌లో సెంచరీ చేసిన నన్ను అకారణంగా తొలగించారు. చరిత్రలో ఇలా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. భారత క్రికెట్లో దీంతో పోల్చదగిన ఘటనలు గతంలోను, ఇకపైనా జరగకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. -
కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని..!
స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి కెప్టెన్ విరాట్ కోహ్లియే కారణమని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుంబ్లేను అవమానకరరీతిలో పదవి నుంచి తప్పుకునేలా చేసిన కోహ్లికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఓ అభిమాని భావించాడు. అందుకే, వృత్తిపరంగా మెకానికల్ ఇంజినీర్ అయినప్పటికీ, భారత్ క్రికెట్ కోచ్ పదవికి అతను దరఖాస్తు చేశాడు. ఓ నిర్మాణ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి తాజాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. 'అహంకారి అయిన కోహ్లిని సరైన దారిలో పెట్టేందుకే' తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు అతను తెలిపాడు. బీసీసీఐ వెబ్‌సైట్‌లోని ఈమెయిల్ఐడీ ఆధారంగా అతను ఈ దరఖాస్తు చేశాడు. కోచ్ పదవి నుంచి కుంబ్లేను తొలగించడానికి కోహ్లియే కారణమని దేశంలోని కోట్లాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్టే తాను భావిస్తున్నట్టు అతను తన దరఖాస్తులో తెలిపాడు. 'లెజండరీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో నేను ఈ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాను. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి లెజండరీ క్రికెటర్లు కోచ్‌గా అవసరం లేదు. బీసీసీఐ ప్రకటన ప్రకారం మరోసారి మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా ఎంపిక చేసినా.. కుంబ్లే తరహాలోనే ఆయనను కూడా కోహ్లి అవమానిస్తాడు. కాబట్టి ఎలాంటి క్రికెట్ నైపుణ్యం లేకున్నా నేనే కోచ్ పదవికి పర్ఫెక్ట్ చాయిస్. అహంకార పూరిత వైఖరితో నేను సర్దుకోగలను. మెల్లగా కోహ్లిని నేను సరైన దారిలోకి తీసుకొస్తాను. అప్పుడు బీసీసీఐ ఓ లెజండ్ క్రికెటర్‌ను కోచ్‌గా నియమించుకోవచ్చు' అంటూ బ్రహ్మచారి తన దరఖాస్తులో సరదాగా కామెంట్ చేశాడు. -
విండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ పరిపాలకుల కమిటీ ( సీఓఏ) సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల చివర్లో భారత జట్టు పర్యటించే వెస్టిండీస్ సిరీస్ వరకు కుంబ్లేనే కోచ్‌గా ఉంటాడని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ నెల 20 తో కుంబ్లే కోచ్‌పదవి కాలం ముగియనుండటంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కుంబ్లేకు భారత కెప్టెన్ కోహ్లీకి విభేదాలు తలెత్తడంతో మార్పు అనివార్యమని అందరూ భావించినా బీసీసీఐ కుంబ్లే పదవి కాలన్ని పొడిగించింది. అంతకు ముందు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని బీసీసీఐకి సూచించినట్లు వార్తలు వచ్చాయి. -
సెహ్వాగ్ రెజ్యూమ్.. బిత్తరపోయిన బీసీసీఐ!
సెహ్వాగ్ అంటే సెహ్వాగే. మైదానంలో చెలరేగి ఆడినా, ట్విట్టర్లో కితకితలు పెట్టే జోక్స్ పేల్చినా అతని స్టైల్ అతనిదే. అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి అతడు పంపించిన రెజ్యూమ్ చూసి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బిత్తరపోయింది. కేవలం రెండంటే రెండే లైన్లలో కోచ్ పదవి కోసం వీరేందర్ సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. ‘ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్, కోచ్‌గా ఉన్నాను. ఈ (టీమిండియా) బాయ్స్ అందరితో ఆడాను’ అంటూ సెహ్వాగ్ తన రెండు లైన్ల అప్లికేషన్లో పేర్కొన్నాడు. ఈ దరఖాస్తు చూసి విస్తుపోయిన బీసీసీఐ అధికారులు.. పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను, రెజ్యూమ్‌ను పంపించమంటూ అతన్ని బతిమిలాడుకొని ఒప్పించారు. ‘సెహ్వాగ్ రెండులైన్ల దరఖాస్తును పంపించాడు. దానికి అనుబంధంగా రెజ్యూమ్ కూడా పంపలేదు. దీంతో దరఖాస్తుతోపాటు రెజ్యూమ్ కూడా పంపాల్సిందిగా మేం అతన్ని అడిగాం. అతను ఈ పదవి కోసం తొలిసారి ఇంటర్వ్యూ హాజరవుతున్నాడు’ అని బీసీసీఐకి చెందిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోచ్ అనిల్కుంబ్లేతోపాటు సెహ్వాగ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్, డొమెస్టిక్ వెటరన్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తదితరులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కుంబ్లేతో సహా వీరంతా సీఏసీ ఎదుట ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. -
టెస్టుల్లో టీమిండియా విజయానికి అతనే కీలకం!
బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పూజరాకు టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే పూర్తి మద్దతు ప్రకటించారు. మిడిలార్డర్లో స్థిరంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న పూజరాను తరచూ జట్టు నుంచి తీసివేయడం సరికాదని కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఇటీవల వెస్టిండీస్‌తో మూడో టెస్టు సందర్భంగా పూజరాను తుది జట్టులోంచి తీసేసిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం పూజరా మెడపై కత్తి వేలాడిస్తూ.. అతని ఆటకు అంతరాయం కలిగించడాన్ని కుంబ్లే తప్పుబట్టారు. వెస్టిండీస్ పర్యటనలో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో 16, 46 పరుగులు చేయడంతో మూడో టెస్టుకు పూజరాకు ఉద్వాసన పలికి.. అతని స్థానంలో రోహిత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో 9, 41 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో ఇద్దరినీ జట్టులోకి తీసుకున్నా వర్షం కారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఓ టీవీ చానెల్‌తో కుంబ్లే మాట్లాడుతూ ’పూజరా మా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. అతను మూడోస్థానంలో జట్టుకు ఎంతో కీలకం. కొన్నిసార్లు అతన్ని తొలగించి రోహిత్‌ను జట్టులోకి తీసుకున్న విషయం వాస్తవమే. కానీ, లోయర్ డౌన్లో పరుగులను రాబట్టడానికే ఆ నిర్ణయం తీసుకున్నాం. అందుకే వెస్టిండీస్ పర్యటనలో అతనికి ఒక టెస్టులో అవకాశం లభించలేదు’ అని చెప్పారు. ప్రస్తుతం జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లు అద్భుతంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో కొందరికీ అవకాశం లభించకపోవడం సహజంగానే నిరాశ కలిగిస్తున్నదని తెలిపారు. టెస్టులకు సంబంధించినంతవరకు భారత్ జట్టుకు మూడోస్థానం చాలా కీలకమని, భారత్ విజయానికి పూజరా మూడోస్థానంలో ఆడటం కీలకంగా టీమ్ భావిస్తున్నదని కుంబ్లే వివరించారు. త్వరలో జరగబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో పూజరా కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మేము రవిశాస్త్రిని అడిగాం: గంగూలీ
కోల్‌కతా:భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ జట్టు మాజీ డైరెకర్ట్ రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్‌గా చేయాలని కోరినట్లు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. 'కోచ్ ఇంటర్య్వూ సందర్భంగా రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా నియమించాలని అనుకున్నాం. ఆ విషయాన్ని రవిశాస్త్రికి కూడా చెప్పాం. అయితే ఆ పదవిపై రవిశాస్త్రి ఆసక్తి చూపలేదు'అని గంగూలీ తెలిపాడు. శుక్రవారం తన 44వ పుట్టినరోజు సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రికి బ్యాటింగ్ కోచ్ పదవి అప్పగించాలని అనుకున్న విషయాన్ని గంగూలీ స్పష్టం చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా రవిశాస్త్రితో చోటు చేసుకున్న వివాదంపై మాత్రం గంగూలీ పెదవి విప్పలేదు. టీమిండియా అసిస్టెంట్ కోచ్‌ల విషయాన్ని కూడా కుంబ్లే నిర్ణయానికే వదిలివేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా గంగూలీ తెలిపాడు. మరోవైపు టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలపై గంగూలీ స్పందించాడు. ఆ విషయంపై తనకు పూర్తిగా అవగాహన లేదని, ఒకవేళ బౌలింగ్ కోచ్ పదవికి జహీర్ మొగ్గు చూపితే అతను ఏడాదంతా అందుబాటులో ఉంటాడా?లేదా?అనేది బీసీసీఐ చూసుకుంటుందని గంగూలీ పేర్కొన్నాడు. -
టీమిండియా కోచ్ రేసులో మరో పేరు
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి పేరును కోచ్ పదవికి సూచించినట్టు సమాచారం. కాగా కోహ్లీ ప్రతిపాదనను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరిశీలించిందా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరిస్తుండగా, ఆ జట్టు కోచ్‌గా వెట్టోరి పనిచేస్తున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెట్టోరి గతంలో బెంగళూరు కెప్టెన్‌గా పనిచేశాడు. 2013లో వెట్టోరి కెప్టెన్సీ నుంచి వైదొలిగాక కోహ్లీకి బాధ్యతలు అప్పగించారు. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిశాక కోచ్ పదవికి పలువురు పేర్లు వినిపించాయి. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వచ్చినా.. కోచ్‌గా పనిచేసే తీరకలేదని దాదా స్పష్టం చేశాడు. మరో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు విదేశీ మాజీ క్రికెటర్లు పేర్లు కూడా వినిపించాయి. తాజాగా కోహ్లీ.. వెట్టోరి పేరును ప్రతిపాదించాడు. బీసీసీఐ కోచ్‌గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. -
మళ్లీ టీమిండియా కోచ్ గా చేయండి!
ముంబై: టీమిండియాకు మరోసారి చీఫ్ కోచ్ గా పనిచేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి తనకు ఆహ్వానం అందినట్లు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తనకు బీసీసీఐ పెద్దల నుంచి ఒకటి-రెండు ఫోన్స్ కాల్స్ వచ్చినట్లు తెలిపాడు. కాగా, తాను ప్రస్తుతం కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనట్లు కిరెస్టన్ పేర్కొన్నాడు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ సాధించడంతో పాటు టెస్టుల్లో జట్టును నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత గ్యారీదే. టీమిండియా కోచ్ గా తనవంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించిన కిరెస్టన్.. ప్రస్తుతం కుటుంబానికి దగ్గరగా ఉంటూ క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే కిరెస్టన్ కు మరోసారి ఆ బాధ్యతలను అప్పజెప్పేందుకు గత కొంతకాలం నుంచి బీసీసీఐ యత్నాలు చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి కోచ్ గా చేయాలంటూ పిలుపు వచ్చిన విషయాన్ని కిరెస్టన్ వెల్లడించాడు. 'టీమిండియా జట్టుకు కోచ్ గా చేయాలని బీసీసీఐ కోరింది. నేను క్రికెట్ కు దూరంగా ఉంటూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ నేపథ్యంలో మరోసారి కోచ్ గా చేయడానికి సిద్ధంగా లేను. ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా ఉన్నప్పుడే టీమిండియా కోచ్ గా చేయాలని అడిగినా అందుకు తిరస్కరించాను' అని కిరెస్టన్ తెలిపాడు. భారత్ క్రికెట్ కోచ్‌గా డంకెన్ ఫ్లెచర్ పదవీకాలం ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. 2011లో టీమిండియా కోచ్‌గా నియమితుడైన జింబాబ్వే మాజీ క్రికెటర్ ఫ్లెచర్ నాలుగేళ్లు సేవలందించారు. ఫ్లెచర్ రిటైర్మెంట్ తర్వాత రవిశాస్త్రి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బోర్డు టీమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి పదవీకాలాన్ని పొడిగించినా.. రాబోవు కాలంలో టీమిండియాకు ఒక ఫుల్ టైమ్ కోచ్ ను నియమిస్తే బావుంటుందని బీసీసీఐ భావిస్తోంది. దానిలో భాగంగానే కిరెస్టన్ తో సంప్రదింపులు జరుపుతోంది. -
జూనియర్ ఇండియాకోచ్గా ద్రవిడ్