టెస్టుల్లో టీమిండియా విజయానికి అతనే కీలకం!
బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పూజరాకు టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే పూర్తి మద్దతు ప్రకటించారు. మిడిలార్డర్‌లో స్థిరంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న పూజరాను తరచూ జట్టు నుంచి తీసివేయడం సరికాదని కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఇటీవల వెస్టిండీస్‌తో మూడో టెస్టు సందర్భంగా పూజరాను తుది జట్టులోంచి తీసేసిన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం పూజరా మెడపై కత్తి వేలాడిస్తూ.. అతని ఆటకు అంతరాయం కలిగించడాన్ని కుంబ్లే తప్పుబట్టారు.
వెస్టిండీస్ పర్యటనలో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో 16, 46 పరుగులు చేయడంతో మూడో టెస్టుకు పూజరాకు ఉద్వాసన పలికి.. అతని స్థానంలో రోహిత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లలో 9, 41 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో ఇద్దరినీ జట్టులోకి తీసుకున్నా వర్షం కారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఓ టీవీ చానెల్‌తో కుంబ్లే మాట్లాడుతూ ’పూజరా మా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. అతను మూడోస్థానంలో జట్టుకు ఎంతో కీలకం. కొన్నిసార్లు అతన్ని తొలగించి రోహిత్‌ను జట్టులోకి తీసుకున్న విషయం వాస్తవమే. కానీ, లోయర్ డౌన్‌లో పరుగులను రాబట్టడానికే ఆ నిర్ణయం తీసుకున్నాం. అందుకే వెస్టిండీస్ పర్యటనలో అతనికి ఒక టెస్టులో అవకాశం లభించలేదు’ అని చెప్పారు. ప్రస్తుతం జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లు అద్భుతంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో కొందరికీ అవకాశం లభించకపోవడం సహజంగానే నిరాశ కలిగిస్తున్నదని తెలిపారు. టెస్టులకు సంబంధించినంతవరకు భారత్ జట్టుకు మూడోస్థానం చాలా కీలకమని, భారత్ విజయానికి పూజరా మూడోస్థానంలో ఆడటం కీలకంగా టీమ్ భావిస్తున్నదని కుంబ్లే వివరించారు. త్వరలో జరగబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో పూజరా కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.