టీమిండియా కోచ్ రేసులో మరో పేరు
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి పేరును కోచ్ పదవికి సూచించినట్టు సమాచారం. కాగా కోహ్లీ ప్రతిపాదనను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరిశీలించిందా లేదా అన్న విషయం తెలియరాలేదు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా కోహ్లీ వ్యవహరిస్తుండగా, ఆ జట్టు కోచ్గా వెట్టోరి పనిచేస్తున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెట్టోరి గతంలో బెంగళూరు కెప్టెన్గా పనిచేశాడు. 2013లో వెట్టోరి కెప్టెన్సీ నుంచి వైదొలిగాక కోహ్లీకి బాధ్యతలు అప్పగించారు.
టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి పదవీకాలం ముగిశాక కోచ్ పదవికి పలువురు పేర్లు వినిపించాయి. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వచ్చినా.. కోచ్గా పనిచేసే తీరకలేదని దాదా స్పష్టం చేశాడు. మరో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్తో పాటు విదేశీ మాజీ క్రికెటర్లు పేర్లు కూడా వినిపించాయి. తాజాగా కోహ్లీ.. వెట్టోరి పేరును ప్రతిపాదించాడు. బీసీసీఐ కోచ్గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.