అన్షుమన్ గైక్వాడ్, 1999లో పాకిస్తాన్‌తో చెన్నై టెస్టులో సచిన్ టెండూల్కర్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది గాయంతో బాధపడుతూనే అద్భుత బ్యాటింగ్‌తో విజయానికి చేరువగా తీసుకొచ్చి వెనుదిరిగితే, ఆపై జట్టు ఓటమిపాలైతే ఆ బాధ ఎలా ఉంటుంది... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1999లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఇలాంటి వేదనే అనుభవించాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం 271 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ బరిలోకి దిగింది. తీవ్ర వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నా... సచిన్ 136 పరుగులతో చెలరేగాడు. అయితే నయన్ మోంగియా (52) మినహా సహచరులంతా విఫలం కావడంతో సచిన్ చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. అయితే 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు.
మరో 4 పరుగులకే మిగిలిన 3 వికెట్లు కోల్పోయిన భారత్ చివరకు 12 పరుగులతో ఓడింది. దీనిని గుర్తు చేసుకుంటూ నాటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్... ‘సక్లాయిన్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ తిరిగి వచ్చాక సచిన్ నిరాశ పడ్డాడు. భారత జట్టు ఓడిపోయిందని తెలిసిన తర్వాత అతను బయటకే రాలేదు. ఒక టవల్‌ను అడ్డుగా పెట్టుకొని అతను ఏడుస్తూనే ఉన్నాడు. సచినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే అతను దానిని తీసుకునేందుకు వెళ్లలేదు. వేదికపైనున్న రాజ్‌సింగ్ దుంగార్పూర్ సచిన్ ఎక్కడ అంటూ అడిగినా అతని జాడే లేదు. బహుమతి ప్రదాన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా టెండూల్కర్ తన సీటులోనే స్తబ్దుగా ఉండిపోయాడు. చివరకు నేను సముదాయించాల్సి వచ్చింది. అతను ఇలా భావోద్వేగాలు ప్రదర్శించడం ఎప్పుడూ చూడలేదు’ అని నాటి ఘటనను వివరించారు.
ప్రేక్షకుల మధ్య ఆడితే ఆ మజాయే వేరు
ఏ ఆటలోనైనా ప్రేక్షకులు కూడా భాగమే. మీకు అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా వారి ప్రోత్సాహం, కేకలు క్రీడలో చాలా అవసరం. మైదానంలో ఖాళీ స్టేడియాల మధ్య ఆడటం క్రీడాకారులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ప్రేక్షకులకు ఆటగాళ్లు స్పందించే ఘటనలు కోకొల్లలు. నేను ఏదైనా మంచి షాట్ ఆడినప్పుడు ప్రేక్షకులు అభినందిస్తే మరింత ఊపు వస్తుంది. బౌలర్ కూడా అద్భుతమైన స్పెల్ వేసినప్పుడు అభిమానులు అభినందిస్తుంటే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది. కరోనా తర్వాత ఆటలో సహజంగానే మార్పులు వస్తాయి. సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చు. ఇక బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మిని వాడాలంటే భయపడతారు. ఒకటి మాత్రం స్పష్టం. క్రికెట్ జరగాలని నేనూ కోరుకుంటాను. అయితే అంతా బాగుందని, ఆరోగ్యాలకు ప్రమాదం లేదని భావించినప్పుడే మళ్లీ ఆట మొదలు పెట్టాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిని దాటిన తర్వాతే ఐపీఎల్, టి20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం వీటిపై అసలు చర్చించడమే నా దృష్టిలో అనవసరం.
–సచిన్ టెండూల్కర్
వేడుకలు లేవు...
కోవిడ్–19 కారణంగా దేశంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోరాదని సచిన్ నిర్ణయించుకున్నాడు. ‘సంబరాలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతర సిబ్బందికి మనం అండగా నిలవడం మనందరికీ ముఖ్యమని అతను చెప్పాడు. సహాయనిధికి ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా ఇతర రూపాల్లో కూడా సహాయక కార్యక్రమాల్లో సచిన్ పాలపంచుకుంటున్నాడు’ అని అతను సన్నిహితుడొకరు వెల్లడించారు.
మీకు తెలుసా...
సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 989 మంది క్రికెటర్లతో కలిసి ఆడాడు. ఇందులో 141 మంది టీమిండియా సహచరులు కాగా... 848 మంది ప్రత్యర్థి జట్లకు చెందినవారు.
Comments
Please login to add a commentAdd a comment