సెహ్వాగ్ రెజ్యూమ్.. బిత్తరపోయిన బీసీసీఐ!
సెహ్వాగ్ రెజ్యూమ్.. బిత్తరపోయిన బీసీసీఐ!
Published Tue, Jun 6 2017 9:31 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
సెహ్వాగ్ అంటే సెహ్వాగే. మైదానంలో చెలరేగి ఆడినా, ట్విట్టర్‌లో కితకితలు పెట్టే జోక్స్ పేల్చినా అతని స్టైల్ అతనిదే. అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి అతడు పంపించిన రెజ్యూమ్ చూసి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బిత్తరపోయింది. కేవలం రెండంటే రెండే లైన్లలో కోచ్ పదవి కోసం వీరేందర్ సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. ‘ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు మెంటర్, కోచ్‌గా ఉన్నాను. ఈ (టీమిండియా) బాయ్స్ అందరితో ఆడాను’ అంటూ సెహ్వాగ్ తన రెండు లైన్ల అప్లికేషన్‌లో పేర్కొన్నాడు.
ఈ దరఖాస్తు చూసి విస్తుపోయిన బీసీసీఐ అధికారులు.. పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను, రెజ్యూమ్‌ను పంపించమంటూ అతన్ని బతిమిలాడుకొని ఒప్పించారు. ‘సెహ్వాగ్ రెండులైన్ల దరఖాస్తును పంపించాడు. దానికి అనుబంధంగా రెజ్యూమ్ కూడా పంపలేదు. దీంతో దరఖాస్తుతోపాటు రెజ్యూమ్ కూడా పంపాల్సిందిగా మేం అతన్ని అడిగాం. అతను ఈ పదవి కోసం తొలిసారి ఇంటర్వ్యూ హాజరవుతున్నాడు’ అని బీసీసీఐకి చెందిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ప్రస్తుత కోచ్ అనిల్‌కుంబ్లేతోపాటు సెహ్వాగ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్, డొమెస్టిక్ వెటరన్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తదితరులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కుంబ్లేతో సహా వీరంతా సీఏసీ ఎదుట ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement