బీసీసీఐ ఇక సూపర్ పవర్ | BCCI boss N. Srinivasan to head the ICC board | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ఇక సూపర్ పవర్

Published Sun, Feb 9 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

బీసీసీఐ ఇక సూపర్ పవర్

బీసీసీఐ ఇక సూపర్ పవర్

బీసీసీఐని అన్నింటా ముందుండి నడిపిస్తున్న అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఇక మరో కీలక బాధ్యతను నిర్వర్తించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఐసీసీ బోర్డు తొలి చైర్మన్‌గా శ్రీని ఎంపికయ్యారు. వచ్చే జూలై నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
 
 సింగపూర్: ఎలాంటి సంచలనాలు లేవు. అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ ఇక ఐసీసీలోనూ శక్తివంతం కానుంది. తాజా పునర్ నిర్మాణ ప్రతిపాదనలకు శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.
 
  దీంతో ఐసీసీ నుంచి అధిక ఆదాయ వాటాతో పాటు పరిపాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం బోర్డుకు లభించినట్టయ్యింది. ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకు కూడా సముచిత ప్రాధాన్యం లభించనుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనలను ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే శనివారం సమావేశంలో అనూహ్యంగా దక్షిణాఫ్రికా కూడా మద్దతు ఇచ్చింది. దీంతో శ్రీలంక, పాక్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఎనిమిది శాశ్వత సభ్య దేశాలు ఐసీసీ పునర్ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లయింది. వీటితో అన్ని దేశాలకు ఆర్థికపరంగా ప్రయోజనాలు కలుగుతాయని ఐసీసీ తెలిపింది. జూన్‌లో జరిగే తమ కౌన్సిల్ భేటీలో వీటికి మరోమారు లాంఛనంగా ఆమోదం తెలుపనున్నారు.
 
 దక్షిణాఫ్రికా అంగీకారం
 కీలకమైన ఓటింగ్‌కు ముందు హైడ్రామా నడిచింది. ఐసీసీలో బీసీసీఐ, సీఏ, ఈసీబీ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ)కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అయితే తాజా సవరణలు ఈ మూడింటికి అనుకూలంగా ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న తమకు తీరని నష్టమని సీఎస్‌ఏ వాదించిన విషయం తెలిసిందే. అటు శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు కూడా సీఎస్‌ఏకు వంత పాడాయి. అయితే బీసీసీఐ తాము అనుకున్నది సాధించాలంటే కనీసం ఎనిమిది సభ్య దేశాల మద్దతు అవసరం. దీంతో ఈ మూడింటిలో ఒకరిని బుజ్జగించాల్సిన అవసరం ఏర్పడింది.
 
 ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రంగంలోకి దిగారు. సీఎస్‌ఏ అధ్యక్షుడు క్రిస్ నెన్‌జానితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2015-23 మధ్య ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేందుకు హామీ లభించింది. భారత్‌తో సిరీస్ అంటే కాసుల పంటే కాబట్టి సీఎస్‌ఏ మెత్తబడింది. అలాగే ఐసీసీతో తమకున్న అనుబంధం దృష్ట్యా ఇదే కాలంలో తమ దేశంలో ఓ మేజర్ ఈవెంట్ జరిగేలా చూడాలని నెన్‌జాని ఐసీసీని కోరారు.
 
 ఇవీ ఆమోదం పొందిన ప్రతిపాదనలు
 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఉండదు. దీని స్థానంలోనే ఇప్పటికే రద్దు చేద్దామనుకున్న చాంపియన్స్ ట్రోఫీని 2017, 2021లో నిర్వహిస్తారు.
 
 సంప్రదాయక టెస్టు ఫార్మాట్‌ను సంరక్షించుకునేందుకు టెస్టు క్రికెట్ నిధి ఏర్పాటు. బీసీసీఐ, సీఏ, ఈసీబీలకు మినహాయించి ఈ నిధిని టెస్టు ఆడే అన్ని దేశాలకు పంపిణీ చేస్తారు.
 అసోసియేట్ దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న వాటికి టెస్టు హోదా దక్కే అవకాశాన్ని కూడా ఐసీసీ ఇవ్వనుంది. వచ్చే ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేత.. టెస్టు ర్యాంకుల్లో అట్టడుగున్న ఉన్న జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంట్లో నెగ్గితే అసోసియేట్ జట్టుకు టెస్టు హోదా దక్కుతుంది.
 
 కొత్తగా ఐసీసీ చైర్మన్ పదవితో పాటు బోర్డుకు కీలక విషయాలపై నివేదిక ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కానుంది. సీఏ చైర్మన్ వాలీ ఎడ్వర్డ్స్ దీనికి నేతృత్వం వహించనున్నారు.
 
 ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి ఈసీబీ అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ నేతృత్వం వహిస్తారు. ఈ రెండు కమిటీల్లో మూడు అగ్రబోర్డులతో పాటు రెండు ఇతర సభ్యదేశాలకు సభ్యత్వం ఉంటుంది.
 
 ఇప్పటిదాకా కొనసాగిన భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ) స్థానంలో పరస్పర అంగీకార ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటాయి.
 
 ఆకర్షణీయ కొత్త హక్కుల ఒప్పందంలో అన్ని దేశాలకు అధిక ఆదాయం రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement