
భవిష్య కార్యాచరణపై బీసీసీఐ కసరత్తు
న్యూఢిల్లీ:లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై తీర్పును సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీ వరకూ రిజర్వ్ లో ఉంచడంతో అందుకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తమ కసరత్తును తీవ్రతరం చేసింది దీనిలో భాగంగా శనివారం మరోసారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం)ను నిర్వహించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు తమ తీర్పు వచ్చే వరకూ నిధులు మంజూరు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో బీసీసీఐ చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీకి దూరమైన జమ్మూ-కశ్మీర్, రాజస్తాన్ రాష్ట్ర క్రికెట్ జట్ల అంశాన్నికూడా పరిశీలించనుంది.
'సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల నిధులను ఆపేయాల్సి వచ్చింది. దాంతో జమ్మూ-కశ్మీర్, రాజస్తాన్ రాష్ట్రాలు ప్రస్తుతం జరుగుతున్న రంజీ టోర్నమెంట్ కు దూరమయ్యాయి. సుప్రీం తీర్పు అంశాన్ని మా సభ్యులు నిర్ణయిస్తారు. ఈ మేరకు అక్టోబర్ 15వ తేదీన ఎస్జీఎం జరుగనుంది' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల అమలుకు తాము ఆమోదం తెలిపినట్లు రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సుమేంద్ర తివారీ తెలిపారు. 'గత రెండు ఏళ్ల నుంచి బీసీసీఐ నుంచి ఎటువంటి నిధులు తీసుకోవడం లేదు. దాంతో మేము ఎటువంటి సమావేశానికి రాకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ నుంచి మాకు రూ.100 కోట్లు రావాల్సి ఉంది' అని తివారీ పేర్కొన్నారు.