అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు  | BCCI elections on October 22 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు 

Published Wed, May 22 2019 12:30 AM | Last Updated on Wed, May 22 2019 12:30 AM

BCCI elections on October 22 - Sakshi

న్యూఢిల్లీ: ఇన్నాళ్లు తాత్కాలిక అధ్యక్షుడు, తాత్కాలిక కార్యదర్శి అని చెప్పుకుంటున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పూర్తిస్థాయి కార్యవర్గంతో కళకళలాడనుంది. సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) క్రికెట్‌ బోర్డుకు ఎన్నికల నగారా మోగించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం సమావేశమైన సీఓఏ దీనికి సంబంధించిన షెడ్యూలును ఖరారు చేసింది. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గే సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ఎన్నికలు సెప్టెంబర్‌ 14వ తేదీతో పూర్తి చేయాలని తుది గడువు విధించారు. వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు 30 రాష్ట్ర సంఘాలు లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తున్నాయని, మిగిలిన సంఘాలు అమలు చేసే పనిలో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లకు పైగా సరైన పాలకవర్గం లేని బీసీసీఐ ఎట్టకేలకు ఈ ఎన్నికలతో పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తుందని, అదే జరిగితే తనకు ‘సుప్రీం’ అప్పగించిన బాధ్యత పూర్తయి... సంతోషంగా నిష్క్రమిస్తానని రాయ్‌ అన్నారు. ‘అప్పట్లో కోర్టు నన్ను నియమించినపుడే చెప్పాను... నా పాత్ర కేవలం నైట్‌ వాచ్‌మన్‌కే పరిమితమని! అయితే ఈ కాపలాదారుడు సుదీర్ఘకాలం ఉండాల్సి వచ్చింది. చివరకు సీఓఏ ఇప్పుడు సంతోషంగా నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది. ఆరంభంలో రాష్ట్ర సంఘాల్లో సిఫార్సుల అమలు కోసం కృషి చేశాం. ఇటు కోర్టు ఆదేశాలను పాటించాం. సంఘాలు, కోర్టుకు మధ్య మధ్యవర్తిత్వం జరిపాం’ అని వినోద్‌ రాయ్‌ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గమే క్రికెట్‌ బోర్డును నడిపించాలని గట్టి పట్టుదలతో కృషి చేశామన్నారు. కోర్టు సహాయకుడి (అమికస్‌)గా నియమితుడైన నర్సింహ కూడా తమతో పాటే శ్రమించారని చెప్పుకొచ్చారు. వివిధ రాష్ట్ర సంఘాలతో మధ్యవర్తిత్వం చేయడంలో ఆయన కృషి గొప్పదని రాయ్‌ అభినందించారు. 

కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తాం 
భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) విధి    విధానాలను ఖరారు చేస్తామని పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. ఇటీవల బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్, అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ చేపట్టిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం విషయంలో సీఏసీ విధులేమిటో, పదవీ కాలమెంతో, అసలు పరిధి ఎంతో ఎవరికీ తెలియదని వీవీఎస్‌ లక్ష్మణ్‌ బహిరంగంగా సీఓఏపై మండిపడ్డారు. దీంతో సీఏసీ విధివిధానాలు రూపొందించి... డీకే జైన్‌ ఆమోదం తర్వాత ప్రకటిస్తామని సీఓఏ వర్గాలు వెల్లడించాయి. విధివిధానాల విషయంలో చాలా ఆలస్యమైన మాట వాస్తవమేనని త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement