క్రికెట్ ఆదాయం క్రికెట్‌కే: శ్రీనివాసన్
చెన్నై: పలు మార్గాల నుంచి వస్తున్న ఆదాయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ అభివృద్ధికే ఖర్చు చేస్తోందని ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ అన్నారు. ఆదాయాన్ని క్రికెటర్లకు, రాష్ట్ర సంఘాలకు పంచుతున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాసన్‌ను మంగళవారం మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్, మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ... బీసీసీఐ లాభాపేక్ష లేని బోర్డు అని, కానీ అందరూ దానిని తప్పుగా అర్థం చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ‘తరుచుగా బీసీసీఐని అంతా తప్పుగా అర్థం చేసుకుంటారు.
బోర్డు చేసే అభివృద్ధి పనులను ఎవరూ పట్టించుకోరు. 2004 నుంచి బీసీసీఐకి మీడియా హక్కులు, స్పాన్సర్ల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా 26 శాతం ఆదాయాన్ని క్రికెట్ సంఘాలకు, దేశవాళీ, జాతీయ క్రికెటర్లకు పంచుతోంది. ఒకప్పుడు రంజీ ట్రోఫీ ఆడే ఆటగాళ్లకు రోజు వందల్లో ఫీజు దక్కేది. ఇప్పుడు రూ. 35 వేలు చెల్లిస్తోంది. అందుకే ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా తయారవుతున్నారు’ అని శ్రీనివాసన్ చెప్పారు.