
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రధాన కార్యాలయం ముంబై నుంచి బెంగళూరుకు తరలిపోయే అవకాశాలున్నాయి. బీసీసీఐకి బెంగళూరులో 40 ఎకరాల భూమి ఉంది. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా బెంగళూరుకు మార్చాలనే యోచన చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఫైవ్ స్టార్ సౌకర్యాల కోసం బీసీసీఐ కొన్ని కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది.
ఆ నేపథ్యంలో బెంగళూరులో క్రికెట్ అడ‍్మినిస్టేటర్స్, గెస్ట్‌లు ఉండేందుకు వీలుగా ప్రధాన కార్యాలయం నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ సమావేశాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో జరిగిన సమయాల్లో ఖర్చు భారీగా అవుతుంది. దాంతోనే బెంగళూరులో ఉన్న సొంత స్థలంలో నేషనల్ క్రికెట్ అకాడమీతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో బీసీసీఐ కార్యాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా.. బోర్డు సభ్యుల అనుమతి కోరుతూ వారందరికీ లేఖలు రాశారు.ఒకవేళ దీనికి ఆమోద ముద్ర పడితే బీసీసీఐ కార్యకలాపాలు రెండు-మూడేళ్లలో ముంబై నుంచి బెంగళూరుకు మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment