'అర్జున'కు పుజారా పేరు ప్రతిపాదన
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం భారత క్రికెటర్ చటేశ్వర పుజారా పేరును భారత క్రికెట్ కంట్రోల్(బీసీసీఐ) బోర్డు ప్రతిపాదించింది. గత సీజన్ లో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన పుజారాకు అర్జున అవార్డును నామినేట్ చేస్తూ సోమవారం సమావేశమైన బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మహిళా క్రికెట్ సభ్యురాలు హర్మన్ ప్రీత్ కౌర్ పేరును కూడా బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న కోసం మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు.
'మేము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం ఎవరు పేరు ప్రతిపాదించడంల లేదు. కేవలం చటేశ్వర పుజరా, హర్మన్ ప్రీత్ పేర్లను మాత్రమే అర్జున అవార్డు కోసం నామినేట్ చేశాం. వారిద్దరి ప్రదర్శన ఆధారంగానే అర్జునకు ఎంపికకు ప్రతిపాదించాం'అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.