'ఆ క్రికెటర్లపై నిషేధాన్ని తొలగించం'
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషులుగా బయటపడిన క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్ల చల్లింది. వీరిపై అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించబోమని బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని వెల్లడించింది.
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, చవాన్ బోర్డు జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చండీలాపై ఆరోపణలు బోర్డు ఇంకా విచారిస్తోంది. కాగా ఇటీవల ఢిల్లీ కోర్టు ఈ ముగ్గురు ఆటగాళ్లతో సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరికను నిషేధిత ఆటగాళ్లు వ్యక్తం చేశారు. శ్రీశాంత్పై నిషేధం తొలగించాలని కేరళ క్రికెట్ సంఘం బీసీసీకి విన్నవించింది. అయితే శ్రీశాంత్, చవాన్లపై నిషేధం ఎత్తివేసే ప్రశ్నలేదని బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ స్పష్టం చేశారు. బీసీసీఐ క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిషేధిత నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు. చట్టపరమైన చర్యలకు, బోర్డు క్రమశిక్షణ చర్యలకు సంబంధం లేదని ఠాకూర్ అన్నారు.