భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్‌ | Only Few Stayed In Touch, Sreesanth | Sakshi
Sakshi News home page

భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్‌

Published Mon, May 11 2020 4:13 PM | Last Updated on Mon, May 11 2020 4:13 PM

Only Few Stayed In Touch, Sreesanth - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శ్రీశాంత్‌ తన రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో అతనిపై ఉన్న  ఏడేళ్ల నిషేధం తొలగిపోవడంతో పునరాగమనం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నట్లు శ్రీశాంత్‌ తాజాగా వెల్లడించాడు. ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ).   రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్ నిషేధం విధించారు. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసి పలుమార్లు తన జీవిత కాల నిషేధంపై అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐకి అవకాశం ఇవ్వలేదు. అలానే అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాగా, గతేడాది శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశాలిచ్చారు. దాంతో  అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తి కానుంది. దీనిలో భాగంగా మాట్లాడిన శ్రీశాంత్‌.. ‘ పలువుర భారత క్రికెటర్లు నాతో టచ్‌లో ఉన్నారు. (ఆసీస్‌కు నంబర్‌వన్‌ ర్యాంక్‌ ఎలా ఇచ్చారు?)

చాలా మంది క్రికెటర్లు నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కానీ వీరూ(సెహ్వాగ్‌) భాయ్‌, లక్ష్మణ్‌ భాయ్‌ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ముగ్గురు నుంచి-నలుగురు ప్లేయర్లు నాతో మాట్లాడున్నారు. వీరిలో సచిన్‌ టెండూల్కర్‌, గౌతం గంభీర్‌ కూడా ఉన్నారు. ఇటీవలే గంభీర్‌ను కలిశాను. మొన్నా మధ్య హర్భజన్‌ సింగ్‌(భజ్జీ)ని ఎయిర్‌పోర్ట్‌లో  కలిశాను. ఆ సమయంలో భజ్జీకి ఒక విషయం చెప్పా. నేను తిరిగి క్రికెట్‌ ఆడినప్పుడు భజ్జీ స్పోర్ట్స్‌ కంపెనీ తయారు చేసిన బ్యాట్‌ను వాడతానని చెప్పాను. ఇంకా నాలో ఆశ చావలేదు. మళ్లీ భారత్‌కు ఆడతాననే ఆశ ఉంది. నా తొలి టార్గెట్‌ కేరళ జట్టులో ఆడటం. ఏదొక రోజు మెన్‌ ఇన్‌ బ్లూలో నన్ను నేను చూసుకుంటా’ అని శ్రీశాంత్‌ తెలిపాడు.2013 ఐపీఎల్‌ సందర్భంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ముందుకు వెళ్లింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌... డీకే జైన్‌ను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా నియమించింది.(టీమిండియా ఫీల్డింగ్‌ మాతోనే పోయింది!)

దీనిలో భాగంగానే  శ్రీశాంత్‌పై నిషేధాన్ని జైన్‌ ఏడేళ్లకు పరిమితం చేశారు.  శ్రీశాంత్‌ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్‌ కెరీర్‌ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్‌ పేర్కొన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్‌ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్‌ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్‌ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్‌ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్‌ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement