న్యాయం చేయండి: శ్రీశాంత్‌ భార్య | Sreesanths wife writes open letter to BCCI, demands justice | Sakshi
Sakshi News home page

నా భర్తకు న్యాయం చేయండి: శ్రీశాంత్‌ భార్య

Published Thu, Nov 29 2018 11:16 AM | Last Updated on Thu, Nov 29 2018 2:13 PM

Sreesanths wife writes open letter to BCCI, demands justice - Sakshi

భార్య భువనేశ్వరితో శ్రీశాంత్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: తన భర్తకు న్యాయం చేయాలంటూ భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లేఖ రాశారు టీమిండియా వెటరన్‌ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తన భర్తపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని, అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని భువనేశ్వరి బీసీసీఐకి రాసిన  బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణల కారణంగా తన భర్త జీవితం నాశనమైందని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అన్యాయమనేది ఎక్కడైనా ముప్పును తెచ్చిపెడుతుందని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తప్పుచేయని తన భర్తని చూస్తే గుండె బద్ధలైనట్లు ఉంటుందని పేర్కొన్నారు.

2015లో ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌పై ఉన్న స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టేసినప్పటికీ, బోర్డు మాత్రం నిషేధం ఎత్తేయడానికి అంగీకరించలేదు.తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీప్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని బెంచ్ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించడంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రీశాంత్‌తోపాటు ఇద్ద‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చ‌వాన్‌ల‌ను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

దీంతో ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినప్పటికీ, బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేరళ హైకోర్టులో అతడికి ఊరట లభించింది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని బీసీసీఐ సవాల్ చేసింది.  శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అందుకే తాము నిషేధం విధించామని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో కేరళ హైకోర్టు మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 17న నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు చేసేదేమీ లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement