
Deepak Hooda In Match Fixing Scanner: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా నిన్న(సెప్టెంబర్ 21) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 పరగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాడు దీపక్ హూడా తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హూడా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో అతను పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైనా సరే తుది జట్టు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్‌కు ముందు బహిర్గతం చేయకూడదు.
ఈ నేపథ్యంలో ఈ పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ తుది జట్టు వివరాలను బయటపెట్టడంపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతన్ని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నిఘా పరిధిలోకి తీసుకువచ్చింది. జట్టు, పిచ్ సంబంధిత వివరాలను బహిర్గతం చేయడం బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అన్నీ తెలిసి కూడా దీపక్ హూడా తుది జట్టు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం నేరమని ఏసీయూ పేర్కొంది.
రంజీ జట్టు కెప్టెన్‌గా, గతంలో పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఎంతో అనుభవమున్న హూడా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఈ పోస్ట్‌ను అతను అనుకోకుండా పెట్టాడా లేదా బుకీలకు ఏదైనా హింట్ ఇద్దామని చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని ఏసీయూ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు చేయాల్సి దశలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హూడా డకౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు చేసిన ఎంసీసీ