ఆంధ్రను గెలిపించిన ఝాన్సీ | BCCI Senior Womens One Day League Tournament | Sakshi
Sakshi News home page

ఆంధ్రను గెలిపించిన ఝాన్సీ

Published Sun, Dec 2 2018 12:47 AM | Last Updated on Sun, Dec 2 2018 12:47 AM

BCCI Senior Womens One Day League Tournament - Sakshi

సాక్షి, గుంటూరు: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న సీహెచ్‌ ఝాన్సీ లక్ష్మి బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు శుభారంభం చేయడంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఝాన్సీ లక్ష్మి ఆ తర్వాత బ్యాటింగ్‌లో సరిగ్గా 100 పరుగులు చేసి సెంచరీ సాధించింది. స్థానిక జేకేసీ కాలేజీ మైదానంలో పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పంజాబ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు    174 పరుగులు చేసింది. కెప్టెన్‌ తానియా భాటియా (108 బంతుల్లో 66; 8 ఫోర్లు), పర్వీన్‌ ఖాన్‌       (105 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు.   వీరిద్దరు నాలుగో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. ఐదు పరుగుల తేడాలో తానియా, పర్వీన్‌లను ఔట్‌ చేసిన ఝాన్సీ లక్ష్మి పంజాబ్‌ను కట్టడి చేసింది. ఝాన్సీ లక్ష్మితోపాటు బౌలింగ్‌లో అంజలి శర్వాణి (2/33), పుష్పలత (2/20) కూడా ఆకట్టుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర 46.4         ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్‌ అనూష (22; 2 ఫోర్లు)తో కలిసి        ఝాన్సీ లక్ష్మి (125 బంతుల్లో 100; 13 ఫోర్లు)     తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 164 పరుగులవద్ద నాలుగో వికెట్‌ రూపంలో ఝాన్సీ లక్ష్మి ఔటైనా మిగతా పనిని హిమబిందు (4 నాటౌట్‌), పుష్పలత (10 నాటౌట్‌) పూర్తి చేశారు. 

పూనమ్‌ యాదవ్‌ 10–6–8–6 
మూలపాడులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ 172 పరుగులతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్‌ క్రికెటర్లు పూనమ్‌ రౌత్‌ (104; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్‌ (62; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో తొలుత రైల్వేస్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. అనంతరం గోవా 44.1 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ 10 ఓవర్లలో 6 మెయిడిన్‌లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. చత్తీస్‌గఢ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐదు వికెట్లతో నెగ్గింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement