womens one day tournment
-
ఆంధ్ర... తొలిసారి
బెంగళూరు: బీసీసీఐ అఖిల భారత సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. హిమాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట హిమాచల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నీనా చౌదరీ (79 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, సుష్మ వర్మ (59; 5 ఫోర్లు, సిక్స్), హర్లీన్ డియోల్ (41; 4 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి, ఝాన్సీలక్ష్మి, శరణ్య తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలిచింది. చంద్రలేఖ (49; 3 ఫోర్లు), హిమబిందు (45 నాటౌట్; 5 ఫోర్లు), ఝాన్సీలక్ష్మి (40; 5 ఫోర్లు), పద్మజ (33; 5 ఫోర్లు) సమష్టిగా రాణించారు. హిమాచల్ బౌలర్లలో రేణుక 2 వికెట్లు పడగొట్టగా, తనూజకు ఒక వికెట్ దక్కింది. సోమవారం జరిగే ఫైనల్లో బెంగాల్‌తో ఆంధ్ర తలపడుతుంది. రైల్వేస్‌కు షాక్ మిథాలీ, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తదితర భారత స్టార్ క్రికెటర్లున్న రైల్వేస్‌కు బెంగాల్ జట్టు షాకిచ్చింది. 21 పరుగుల తేడాతో మిథాలీ రాజ్ సేనపై గెలుపొందిన బెంగాల్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. మొదట బెంగాల్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగులు చేసింది. దీప్తి (85), జులన్ గోస్వామి (50 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఏక్తా బిష్త్ 2 వికెట్లు తీసింది. తర్వాత రైల్వేస్ 49 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌటైంది. నుజహత్ పర్వీన్ (74) మినహా ఇంకెవరు జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేదు. కెప్టెన్ మిథాలీ 37, మోనా 28, అరుంధతి రెడ్డి 21 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్ శుభ్‌లక్ష్మి 5 వికెట్లు, జులన్ 3 వికెట్లు తీశారు. -
ఆంధ్రను గెలిపించిన ఝాన్సీ
సాక్షి, గుంటూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సీహెచ్ ఝాన్సీ లక్ష్మి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేయడంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఝాన్సీ లక్ష్మి ఆ తర్వాత బ్యాటింగ్‌లో సరిగ్గా 100 పరుగులు చేసి సెంచరీ సాధించింది. స్థానిక జేకేసీ కాలేజీ మైదానంలో పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ తానియా భాటియా (108 బంతుల్లో 66; 8 ఫోర్లు), పర్వీన్ ఖాన్ (105 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. ఐదు పరుగుల తేడాలో తానియా, పర్వీన్‌లను ఔట్ చేసిన ఝాన్సీ లక్ష్మి పంజాబ్‌ను కట్టడి చేసింది. ఝాన్సీ లక్ష్మితోపాటు బౌలింగ్‌లో అంజలి శర్వాణి (2/33), పుష్పలత (2/20) కూడా ఆకట్టుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర 46.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ అనూష (22; 2 ఫోర్లు)తో కలిసి ఝాన్సీ లక్ష్మి (125 బంతుల్లో 100; 13 ఫోర్లు) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 164 పరుగులవద్ద నాలుగో వికెట్ రూపంలో ఝాన్సీ లక్ష్మి ఔటైనా మిగతా పనిని హిమబిందు (4 నాటౌట్), పుష్పలత (10 నాటౌట్) పూర్తి చేశారు. పూనమ్ యాదవ్ 10–6–8–6 మూలపాడులో గోవాతో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ 172 పరుగులతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ క్రికెటర్లు పూనమ్ రౌత్ (104; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (62; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో తొలుత రైల్వేస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. అనంతరం గోవా 44.1 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 10 ఓవర్లలో 6 మెయిడిన్లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. చత్తీస్‌గఢ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐదు వికెట్లతో నెగ్గింది. -
రన్నరప్ హైదరాబాద్
గుంటూరు స్పోర్ట్స్, న్యూస్‌లైన్: సౌత్ జోన్ అండర్-19 మహిళల వన్డే టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆడిన ఐదు లీగ్ మ్యాచ్‌ల్లో నాలుగింటిలో హైదరాబాద్ జట్టు విజయాలు సాధించింది. స్థానిక పేరేచర్ల క్రికెట్ గ్రౌండ్లో శనివారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గోవా జట్టుపై ఘన విజయం సాధించింది. 108 పరుగుల విజయ లక్ష్యాన్ని 22.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గోవా 46 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరోవైపు ఓటమనేది లేకుండా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్రా జట్టు విజేతగా నిలిచింది. బెస్ట్ బ్యాట్స్ ఉమన్‌గా టోర్నీలో అత్యధికంగా 192 పరుగులు చేసిన హైదరాబాద్ బ్యాట్స్ ఉమన్‌గా స్నేహ ఎంపికైంది. బెస్ట్ బౌలర్‌గా హైదరాబాద్ బౌలర్ ఎం.భోగి ఎంపికైంది.