
బెంగళూరు: బీసీసీఐ అఖిల భారత సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. హిమాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట హిమాచల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నీనా చౌదరీ (79 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, సుష్మ వర్మ (59; 5 ఫోర్లు, సిక్స్), హర్లీన్ డియోల్ (41; 4 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి, ఝాన్సీలక్ష్మి, శరణ్య తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలిచింది. చంద్రలేఖ (49; 3 ఫోర్లు), హిమబిందు (45 నాటౌట్; 5 ఫోర్లు), ఝాన్సీలక్ష్మి (40; 5 ఫోర్లు), పద్మజ (33; 5 ఫోర్లు) సమష్టిగా రాణించారు. హిమాచల్ బౌలర్లలో రేణుక 2 వికెట్లు పడగొట్టగా, తనూజకు ఒక వికెట్ దక్కింది. సోమవారం జరిగే ఫైనల్లో బెంగాల్‌తో ఆంధ్ర తలపడుతుంది.
రైల్వేస్‌కు షాక్
మిథాలీ, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తదితర భారత స్టార్ క్రికెటర్లున్న రైల్వేస్‌కు బెంగాల్ జట్టు షాకిచ్చింది. 21 పరుగుల తేడాతో మిథాలీ రాజ్ సేనపై గెలుపొందిన బెంగాల్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. మొదట బెంగాల్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగులు చేసింది. దీప్తి (85), జులన్ గోస్వామి (50 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఏక్తా బిష్త్ 2 వికెట్లు తీసింది. తర్వాత రైల్వేస్ 49 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌటైంది. నుజహత్ పర్వీన్ (74) మినహా ఇంకెవరు జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేదు. కెప్టెన్ మిథాలీ 37, మోనా 28, అరుంధతి రెడ్డి 21 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్ శుభ్‌లక్ష్మి 5 వికెట్లు, జులన్ 3 వికెట్లు తీశారు.