
సాక్షి, గుంటూరు వెస్ట్: సమష్టి ప్రదర్శనతో రాణించిన ఆంధ్ర జట్టు బీసీసీఐ మహిళల వన్డే లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 17 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 45.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎన్. అనూష (45; 7 ఫోర్లు), హిమబిందు (21; 4 ఫోర్లు), ఇ. పద్మజ (39; 3 ఫోర్లు) రాణించారు. పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో ఓపెనర్ ఝాన్సీ లక్ష్మి ఈ మ్యాచ్‌లో తాను ఆడిన తొలి బంతికే ఔటయ్యింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు 43 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది.
బీఎస్ ఫుల్మాలి (83 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఆమెకు సరైన సహకారం లభించకపోవడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. ఆంధ్ర బౌలర్లలో చంద్రలేఖ 15 పరుగులిచ్చి 3 వికెట్లు, ఝాన్సీ లక్ష్మి 43 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు. మూలపాడులో జరిగిన మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర 183 పరుగుల తేడాతో హరియాణాను ఓడించింది. టీఎస్ హసాబ్నిస్ (131 బంతుల్లో 148; 23 ఫోర్లు) సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 2 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఎం.ఆర్.మాగ్రే (70; 7 ఫోర్లు)తో కలిసి హసాబ్నిస్ తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించడం విశేషం. అనంతరం మాయా సోనావానె (6/23) ధాటికి హరియాణా 33.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. సౌరాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment