త్వరలో మినీ ఐపీఎల్!
ధర్మశాల: ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్ ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రధానంగా భారత్లో జరిగే ఐపీఎల్ను ఇక నుంచి విదేశాల్లో కూడా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. కాగా, భారత్కు బయట జరిపే ఈ టోర్నీని 'మినీ ఐపీఎల్' పేరుతో నిర్వహించనున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా వేదికల అన్వేషణలో ఉన్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకూ ఈ టోర్నీని సెప్టెంబర్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు అనురాగ్ పేర్కొన్నారు.
ఇందుకు యూఎస్తో పాటు యూఏఈ వేదికలు పరిశీలనలో ఉన్నాయి. 2014లో ఐపీఎల్ టోర్నీ జరిగిన యూఏఈలో మినీ టోర్నీ నిర్వహించడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇదిలా ఉండగా, రంజీ ట్రోఫీ టోర్నీలను తటస్థ వేదికలపై నిర్వహించడానికి వర్కింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్త టీ 20 లీగ్ను నిర్వహించడానికి కూడా అంగీకారం తెలిపింది.