న్యూఢిల్లీ: ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ ఒకవేళ జరగకపోతే బోర్డుకు ఏకంగా రూ.4000 కోట్ల నష్టం వస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని... అయితే దీనిపై ఇప్పుడే కచ్చితంగా ఏ విషయమూ చెప్పలేమని అన్నారు. ఇప్పటికైతే ఆ సిరీస్‌పై, టి20 ప్రపంచకప్‌పై ఆస్ట్రేలియాగానీ, ఐసీసీ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని కాబట్టి ముందనుకున్నట్లే జరుగుతాయని ఆశిస్తున్నట్లు అరుణ్ తెలిపారు. ప్రతీ విదేశీ పర్యటనకు ముందు 14 రోజుల క్వారంటైన్ ప్రతీసారీ కష్టమని చెప్పారు.
ఆసీస్‌లో టి20 ప్రపంచకప్ కోసం 16 జట్ల రాక, బస, క్వారంటైన్‌లతో పోలిస్తే భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు కాస్త తక్కువ సమస్యలుంటాయని అరుణ్ వివరించారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితి మారితే, లాక్‌డౌన్ ముగిస్తే తదుపరి కార్యాచరణపై ఆలోచన చేయవచ్చన్నారు. ముందుగా ఆటగాళ్ల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఇరు ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగానే క్రికెట్ బోర్డులు నడుచుకుంటాయని అన్నారు. వైరస్ అదుపులోకి వచ్చాక విదేశీ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు, సడలింపులను బట్టే ఏదైనా నిర్ణయం వెలువరించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment