మినీ ఐపీఎల్ కు బ్రేక్!
లాడర్హిల్: ఇటీవల అమెరికాలో వెస్టిండీస్తో జరిగిన టీ 20 మ్యాచ్లు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో విదేశాల్లో నిర్వహించాలనుకున్నమినీ ఐపీఎల్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికాకు క్రికెట్ మార్కెట్ రుచి చూపించినా, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో వెస్టిండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ అనుకున్నంత ఆదరణ దక్కలేదు. దీంతో విదేశాల్లో సెప్టెంబర్ లో నిర్వహించాలనుకున్న మినీ ఐపీఎల్ ప్రణాళికల్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు బీసిసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రధానంగా మ్యాచ్ ల సమయం విషయంలో అనుకూలత లేకపోవడమే మినీ ఐపీఎల్ ఆలోచనను పక్కకు పెట్టినట్లు ఆయన తెలిపారు.
' విదేశాల్లో టోర్నీలు నిర్వహించేటప్పుడు సమయంలో వ్యత్యాసాన్ని తప్పకుండా మనం అర్ధం చేసుకోవాలి. భారత్లో జరిగే ఐపీఎల్ రాత్రి గం.7.00 నుంచి సుమారు రాత్రి గం.11.30 ని.ల వరకూ ఉంటుంది. అమెరికాలో పగటి మ్యాచ్లు జరిగితే, భారత్లో ఆ మ్యాచ్లను రాత్రి వేళల్లో వీక్షిస్తారు. ఇక్కడ బ్రాడ్ కాస్టింగ్ అనేది చాలా పెద్ద సమస్య. మనం విదేశాల్లో టోర్నీలు జరుపుతున్నప్పుడు భారత అభిమానుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విదేశాల్లో మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు భారత్లో టీవీల ద్వారా చూసే వీక్షకుల్ని వదులుకోకూడదు. ప్రత్యేకంగా యూఎస్లో మ్యాచ్లు జరిగేటప్పుడు అక్కడ ఏ రాష్ట్రంలో మ్యాచ్లు ఆడుతున్నాము అనేది కూడా ముఖ్యం. కాకపోతే మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. దానిపై పూర్తి కసరత్తు చేసిన తరువాత మినీ ఐపీఎల్పై వివరాలను వెల్లడిస్తాం. ప్రస్తుతానికైతే ఆ టోర్నీకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదు 'అని ఠాకూర్ తెలిపారు. గత జూన్లో విదేశాల్లో మినీ ఐపీఎల్ను నిర్వహిస్తామంటూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్ లో కానీ, యూఏఈలో కానీ మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. తాజాగా అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో ఆ టోర్నీ అమెరికాలో జరిగే అవకాశం లేదనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు.