
ఒక ఫాస్ట్ బౌలర్ సక్సెస్ కావాలంటే..
పల్లెకెలె:శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రెండు, మూడు వన్డేల్లో భారత పేసర్ జస్ప్రిత్ బూమ్రా విశేషంగా రాణించి విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో నాలుగు వికెట్లతో మెరిసిన బూమ్రా.. మూడో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. శ్రీలంకలో తొలిసారి పర్యటిస్తున్న బూమ్రా ప్రదర్శన పట్ల భారత జట్టు యాజమాన్యం సంతోషంగా ఉంది. ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లి.. బూమ్రాను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. అయితే ఒక ఫాస్ట్ బౌలర్ సక్సెస్ కావాలంటే నిరంతర శ్రమంతో పాటు నిలకడగా బౌలింగ్ చేస్తేనే సాధ్యమని అంటున్నాడు బూమ్రా. తాను జట్టులోకి వచ్చినప్పుడు ఏ సందర్భంలో ఎలా బౌలింగ్ వేయాలో తెలిసేది కాదని, అనుభవంతో పరిణితి సాధిస్తూ బౌలింగ్ లో టెక్నిక్స్ నేర్చుకుంటున్నట్లు తెలిపాడు.
'ఫాస్ట్ బౌలర్ కు ఏదొక టెక్నిక్ మాత్రమే ఉండే సరిపోదు. ఎక్కడ ఎలా బౌలింగ్ చేయాలి అనే దానిపై పూర్తి స్థాయి కసరత్తు చేయాలి. ఈ క్రమంలోనే కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. జట్టులో నిలకడగా బౌలింగ్ చేయాలంటే మాత్రమే ప్రతీరోజూ పాఠాలు నేర్చుకుంటూ పోతేనే సాధ్యం. అదే నా లక్ష్యం కూడా. శ్రీలంకలో ఇదే నా తొలి పర్యటన. అంతకుముందెప్పుడూ ఏ స్థాయి క్రికెట్ ఇక్కడ ఆడలేదు. దాంతో లంకలోని పరిస్థితులు చాలెంజ్ గా అనిపించాయి. సీనియర్ల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని నా బౌలింగ్ కు పదునుపెట్టా. అదే నాకు సక్సెస్ ను ఇచ్చింది. జట్టు సక్సెస్ లో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు జట్టు ఏ బాధ్యతను అప్పచెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా'అని బూమ్రా పేర్కొన్నాడు.