భువన శుభారంభం
ఐటీఎఫ్ టోర్నమెంట్
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి కాల్వ భువన శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 842వ ర్యాంకర్ భువన 1-6, 7-5, 6-4తో ప్రపంచ 396వ ర్యాంకర్ నవోమి కవాడే (బ్రిటన్)పై సంచలన విజయం సాధించింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన భువన ఈ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
అయితే తన ప్రత్యర్థి సర్వీస్‌ను కీలక దశల్లో ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. డబుల్స్‌లో మాత్రం భువన జంటకు పరాజయం ఎదురైంది. తొలి రౌండ్‌లో భువన-రష్మీ తెల్తుంబ్డే (భారత్) ద్వయం 3-6, 0-6తో కై లిన్ జాంగ్-యుకున్ జాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో నిధి-ప్రార్థన తోంబ్రే (భారత్) జంట 5-7, 6-3, 10-6తో స్నేహదేవి రెడ్డి-ధ్రుతి వేణుగోపాల్ (భారత్) ద్వయంపై గెలిచింది.