పరిణామాలు బాధిస్తున్నాయి: ఇన్ఫోసిస్ మూర్తి
బెంగళూరు: దేశంలో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో ప్రకంపనలపై సహ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్ తొలి చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)లో అత్యుత్తమ ప్రమాణాలకు మారు పేరుగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్థలో సంక్షోభం తలెత్తిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే సమస్య సీఈవో విశాల్ సిక్కాతో కాదనీ బోర్డులోని పారదర్శకత ప్రామాణికత ప్రధాన సమస్య అని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్ దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు.
ఇటీవల రాజీనామా చేసిన డేవిడ్ కెన్నెడీ, సిఎఫ్ఒ రాజీవ్ బన్సాల్ తదితరుల సెవరెన్స్ ప్యాకేలజీపై ఆయన అభ్యంతరం వ్యక‍్తం చేశారు. బన్సల్ కు సాధారణంగా 12 నెలల ప్యాకేజీ కంటే అదనంగా 10 రెట్లు చెల్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రెమ్యునరేషన కమిటీ ఛైర‍్మన్ (జెఫ్రీ లేమన్) నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ చెల్లింపు సందర‍్భంలో ఆయన ప్రత్యేక సమావేశం ద్వారా ఆమోదం పొంది ఉండాల్సిందన్నారు. ఇలాంటి అసాధారణ చెల్లింపు వెనుక అసలు కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది సాధారణ ఉద్యోగులకు ఎలాంటి సంకేతాలను అందిస్తుందని కంపెనీ ఏకైక పెద్ద వాటాదారు (3.44శాతం)గా ఉన్న మూర్తి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మిడిల్ లెవల్, జూనియర్ లెవల్ ఉద్యోగులు ఇప్పటికే ఈ పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారనీ, దాదాపు 1800 పైగా ఈ మెయిల్స్ కు తనకు అందాయని చెప్పారు. దీనిపై సంస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి ఉద్ఘాటించారు. ఇది ఉద్యోగుల నైతిక సామర్థ్యాన్ని దెబ‍్బతీస్తోందని వ్యాఖ్యానించారు. ఎంతో మందిమి దశాబ్దాలుపాటు కష్టపడి ఉత్తమ విలువలు, సంస్కృతితో కూడిన సంస్థను తీర్చిదిద్దామని, కానీ ప్రస్తుత పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు.
అయితే కంపెనీని వీడిన మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్, జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెనడీలకు బోర్డు సెవెరెన్స్ ప్యాకేజీలను ఇచ్చింది. డిసెంబర్‌లో బాధ్యతల నుంచి తప్పుకున్న కెనడీకి 8.68 లక్షల డాలర్లతోపాటు, ఏడాదిపాటు బీమా కవరేజీ కొనసాగింపునకు నిర్ణయించింది. ఇక 2015 అక్టోబర్‌లో కంపెనీని వీడిన రాజీవ్‌కు రూ. 17.38 కోట్లను చెల్లించింది. అయితే ఈ చెల్లింపులను కంపెనీ నిబంధనలు, ఉద్యోగ ఒప్పందం ప్రకారమే నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
గత ఏడాదికాలంగా విలువలు, పారదర‍్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఆందోళనలు చెలరేగినప్పటికి ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులో వచ్చాయి. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలను కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా ఖండించారు.. కార్పొరేట్ నైతికత, సమగ్రత, విలువల విషయంలో ఇన్ఫోసిస్‌కు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ఉద్యోగులను కోరారు. కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత ఈమెయిల్‌లో ఆయన ఈ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే