స్టెయిన్ దగ్గర నేర్చుకుంటున్నా
మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది
భువనేశ్వర్ కుమార్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ పెద్ద సంచలనం. సన్‌రైజర్స్ జట్టు విజయాల్లో తనదే కీలక పాత్ర. కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేయడంలో దిట్ట అయిన ఈ భారత బౌలర్ ఈసారి డెత్ ఓవర్లలోనూ రాణిస్తున్నాడు. తన బౌలింగ్ మెరుగుపరుచుకోవడానికి స్టెయిన్ సలహాలు తీసుకుంటున్నానని చెబుతున్న భువనేశ్వర్ ఇంటర్వ్యూ...
ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనపై స్పందన?
చాలా సంతోషంగా ఉంది. రాజస్థాన్‌పై విజయం మా జట్టులో ఆత్మవిశ్వాసం పెంచింది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. మంచి ఆటతీరును ప్రదర్శించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్తాం.
చిన్న స్కోర్లను సన్‌రైజర్స్ ఎలా కాపాడుకుంటోంది?
ఐపీఎల్‌లో ఏ జట్టుకూ లేని అత్యుత్తమ బౌలింగ్ లైనప్ మా సొంతం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మొతేరా పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని మాకు అర్ధమైంది. బౌలర్లు రాణించడం వల్లే తక్కువ స్కోరైనా విజయం సాధించాం. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
డెత్ ఓవర్లలో చక్కగా బంతులు వేయడంలో స్టెయిన్ సహకారం ఉందా ?
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌తో కలిసి బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ వేయాలో చెబుతూ స్టెయిన్ తన అనుభవాన్ని పంచుకుంటాడు. తన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో బంతుల్ని చక్కగా వేయగలుగుతున్నా. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివర్లో వికెట్లు తీయగలుగుతున్నా.
ఏ వికెట్‌పైనైనా బంతి స్వింగ్ చేయగల సమర్థుడని మాజీ కెప్టెన్ శ్రీకాంత్ అన్నాడు. దీనిపై మీ స్పందన ?
జ. స్వింగే నా బలం (నవ్వుతూ..). నేను బంతిని కావాల్సిన విధంగా స్వింగ్ చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. టి20 క్రికెట్‌లో వికెట్లు పడగొట్టడం చాలా ముఖ్యం. బ్యాట్స్‌మెన్‌ను ఎప్పుడు అవుట్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటా.