భువనేశ్వర్‌కు ప్రమోషన్
‘ఎ’ గ్రేడ్‌లో తొలిసారి చోటు
⇒‘బి’ గ్రేడ్‌లో అంబటి రాయుడు
⇒జాబితా నుంచి గంభీర్, యువీ అవుట్
⇒కాంట్రాక్ట్‌లు ప్రకటించిన బీసీసీఐ
ముంబై: ఏడాది కాలంగా భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్‌గా నిలకడగా రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్‌కు బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ దక్కింది. ఇప్పటి వరకు గ్రేడ్ ‘బి’లో ఉన్న భువీకి బోర్డు ఈసారి గ్రేడ్ ‘ఎ’లో చోటు కల్పించింది. ఈ సీజన్‌లో భువనేశ్వర్‌కు ‘బీసీసీఐ-ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’... ఐసీసీ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ లభించాయి. 2014-15 సీజన్ కోసం బోర్డు సోమవారం కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లకు సంవత్సరానికి రూ. 1 కోటి చొప్పున ఫీజుగా లభిస్తుంది. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ రిటైర్ కావడంతో ఆ స్థానంలో భువనేశ్వర్ వచ్చాడు. గ్రేడ్ ‘బి’ ఆటగాళ్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్ ‘సి’ క్రికెటర్లకు రూ. 25 లక్షల చొప్పున ఫీజు దక్కుతుంది.
సీనియర్ల కథ ముగిసింది
వన్డే ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోని సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లను బోర్డు పూర్తిగా పక్కన పెట్టింది. వారిని కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకుండా భవిష్యత్తుపై తమ ఉద్దేశాన్ని వెల్లడించింది. ఈ ఐదుగురిలో గత ఏడాది గంభీర్, యువరాజ్ మాత్రం గ్రేడ్ ‘బి’లో ఉన్నారు. ఏడాది కాలంగా భారత్ తరఫున మ్యాచ్ ఆడకపోయినా హైదరాబాద్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన ‘బి’ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం.
రాయుడు కూడా ముందుకు
యువ ఆటగాళ్లలో తెలుగు కుర్రాడు అంబటి తిరుపతి (ఏటీ) రాయుడుతో పాటు అజింక్య రహానే, మొహమ్మద్ షమీలకు కూడా ప్రమోషన్ దక్కింది. గత ఏడాది ‘సి’ గ్రేడ్‌లో ఉన్న వీరు నిలకడగా ఆడి ‘బి’లో స్థానం దక్కించుకున్నారు. గ్రూప్ ‘సి’లో కొత్తగా 12 మందికి చోటు దక్కగా... వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, జైదేవ్ ఉనాద్కట్‌లను తప్పించారు. అయితే 30 మంది ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో స్థానం పొందిన మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అశోక్ దిండాలతో పాటు మరో వికెట్ కీపర్ నమన్ ఓజాకు కూడా కాంట్రాక్ట్ దక్కలేదు. ప్రస్తుతం జాబితాలో చోటు లేకపోయినా ఈ సీజన్‌లో ఎవరైనా కొత్త ఆటగాడు అంతర్జాతీయ అరంగేట్రం చేస్తే అతను నేరుగా గ్రూప్ ‘సి’లో స్థానం పొందుతాడని బీసీసీఐ ప్రకటించింది.