మూడో టెస్టులో ఫలితం వచ్చేనా?
గ్రాస్ ఐలెట్: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్నమూడో టెస్టు మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. వెస్టిండీస్ను తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకే కట్టడి చేసి పైచేయి సాధించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో భారత్కు 285 పరుగుల ఆధిక్యం లభించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి అజింక్యా రహానే(51 బ్యాటింగ్), రోహిత్ శర్మ(41) క్రీజ్లో ఉన్నారు. ఆటకు శనివారం చివరిరోజు కావడంతో టెస్టు మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాగా, ఆఖరి రోజు ఆటలో భారత్ తన ఇన్నింగ్స్ ను తొందరగా ముగించి ఫలితం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
అంతకుముందు భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి వెస్టిండీస్ జట్టు కుప్ప కూలింది. భువనేశ్వర్ ఐదు వికెట్లు సాధించడంతో భారత్కు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విండీస్ ఇన్నింగ్స్లో బ్రాత్‌వైట్ (163 బంతుల్లో 64; 6 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (109 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి టెస్టును గెలవగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత తొలి ఇన్నింగ్స్ 353 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 157/3
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 225 ఆలౌట్