బింద్రాపై క్రమశిక్షణ చర్య!
ముంబై: తమకు ఇబ్బందికరంగా మారుతున్న మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రాపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు దిగనుంది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడికి మద్దతిస్తుండడమే కాకుండా వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌పై సరైన రీతిలో వ్యవహరించలేదని బింద్రా విమర్శించారు. ‘ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ ఎప్పటిలాగే మిన్నకుండిపోయింది. రూ.10 వేల కోట్ల కుంభకోణంలో మోడిని ఇరికించేందుకు సమాయత్తమవుతుంది’ అని గురువారం తన ట్విట్టర్ పేజిలో బింద్రా పేర్కొన్నారు.
దీంతో పాటు పలు బీసీసీఐ సమావేశాల మినిట్స్‌ను కూడా జత పరిచారు. దీంతో బోర్డు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బీసీసీఐ పరువుకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నందుకు ముందుగా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని భావిస్తున్నారు. గత జూన్‌లో గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ ముగిసేదాకా శ్రీనివాసన్‌ను సమావేశాలకు హాజరు కానీయవద్దని ఐసీసీ బోర్డు సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. అలాగే ద క్షిణాఫ్రికా క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా లోర్గాట్ నియామకాన్ని సమర్థించారు.