మరో రికార్డుపై అశ్విన్ గురి
కాన్పూర్: ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పడు మరో రికార్డుపై గురి పెట్టాడు. విండీస్తో సిరీస్లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో మెరిసిన అశ్విన్.. న్యూజిలాండ్ తో జరిగే తొలి టెస్టులో బంతితో రాణిస్తే మరో అరుదైన ఘనత అతని ఖాతాలో చేరుతుంది. శనివారం బర్త్ డే జరుపుకుంటున్న అశ్విన్ .. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్ల్లో193 వికెట్లు సాధించాడు. అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ రికార్డు సాధించాలంటే అశ్విన్ కు ఇంకా ఏడు వికెట్లు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డెన్నీస్ లిల్లీ, పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనస్ల పేరిట ఉంది. వీరిద్దరూ 38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అయితే అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ తొలి స్థానంలో ఉన్నాడు. కాగా, గురువారం న్యూజిలాండ్తో జరిగే టెస్టు మ్యాచ్ అశ్విన్కు 37వది కావడంతో వకార్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
విండీస్ తో సిరీస్లో అనేక రికార్డులను అశ్విన్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒక సిరీస్లో రెండు సార్లు ఐదు వికెట్లకు పైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ ఫీట్ ను కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు.1979-80లో పాకిస్తాన్పై, 1981-82లో ఇంగ్లండ్పై కపిల్ దేవ్ ఈ ఘనతను నమోదు చేయగా, రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో భువనే్శ్వర్ కుమార్ రెండుసార్లు ఐదేసి వికెట్లను, 50కు పైగా స్కోరును రెండు సార్లు సాధించాడు.
ఈ నాలుగు టెస్టుల సిరీస్లో తొలి టెస్టులో సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన అశ్విన్.. రెండో టెస్టులో (మొత్తం ఆరు వి కెట్లు) తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. మరోవైపు మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో అశ్విన్ తన టెస్టు కెరీర్ లో నాల్గో శతకాన్ని విండీస్ పై సాధించాడు. దీంతో భారత ఆటగాళ్ల ప్రతిష్టాత్మక క్లబ్లో అశ్విన్ కు చోటు దక్కించుకున్నాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్(13 సెంచరీలు), దిలీప్ వెంగసర్కార్ (ఆరు సెంచరీలు), రాహుల్ ద్రవిడ్ (ఐదు సెంచరీలు) మాత్రమే విండీస్పై అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేశారు. మరోవైపు విండీస్ తో సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న అశ్విన్.. భారత తరుపున టెస్టు ఫార్మాట్ లో అత్యధిక సార్లు ఈ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.