
ఈ క్రికెటర్ ను గుర్తు పట్టగలరా?
న్యూఢిల్లీ: టీమిండియాలో ఆపద్భాంధవుడి పాత్ర పోషించిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా? నిలకడకు నిర్వచనంగా, ప్రొఫెషనలిజంకు పర్యాయపదంగా అతడు క్రికెట్ చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. జట్టు ఓటమి ముందు నిలబడిన ప్రతిసారి అడ్డుగోడలా నిలబడి నిబ్బరంగా ఆడేవాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంటూ ‘మిస్టర్ డిపెండబుల్’ ప్లేయర్ గా ప్రఖ్యాతిగాంచాడు. అతడెవరో కాదు రాహుల్ ద్రవిడ్. ఫొటోలోని చిన్నారి అతడే. ద్రవిడ్ చిన్నప్పటి ఫొటో ఇది. ఈ రోజు ద్రవిడ్ 43 పుట్టినరోజు.
ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు, క్రికెటర్లు అతడికి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ద్రవిడ్ ఆటను, అతడి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు, ఫొటోలు పెట్టారు. క్రికెటోపియా పోస్టు చేసిన ద్రవిడ్ చిన్ననాటి ఫొటోను ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ రీట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన ఆటతీరుతో ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ల సరసన స్థానం సంపాదించుకున్న దవ్రిడ్ రిటైర్మెంట్ తర్వాత కూడా కోచ్ గా క్రికెట్ కు సేవలు అందిస్తున్నాడు.