సాక్షి, బెంగళూరు: భారత అంధుల క్రికెట్ సంఘాన్ని గుర్తించాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి లేఖ రాయడంపై అంధుల క్రికెట్ టీమ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అంధ క్రికెటర్లను బోర్డు పింఛను పథకం కిందకు తీసుకురావాలని కోరుతూ సచిన్ బోర్డు పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అంధుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే మహంతేష్ స్పందిస్తూ.. సచిన్ తమ గురించి ఆలోచించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అందుకు టీమ్ తరుఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సచిన్ రాసిన లేఖను చదివి చాలా ఆనందించినట్టు మహంతేష్ అన్నారు. గత వారం తమ సభ్యులంతా బీసీసీఐని కలిసినపుడు మద్దతు తెలిపడానికి బోర్డు సముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. తాజాగా సచిన్ అంధుల క్రికెట్ సంఘాన్ని గుర్తించాల్సిన అవసరముందని విజ్ఞప్తి చేయడం ఎంతో గొప్ప విషయమని మహంతేష్ పేర్కొన్నారు.
‘అంధుల జట్టు ఎన్నో అవరోధాలు అధిగమించింది. వారి స్ఫూర్తిదాయక ప్రపంచకప్ విజయం మానవ మేధస్సుకు పరిమితి లేదని గుర్తుచేస్తోంది. అందుకని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ)కు గుర్తింపునిస్తూ ఆ క్రికెటర్లను బోర్డు పెన్షన్ పథకం పరిధిలోకి తీసుకోండి’ అని సచిన్ టెండూల్కర్ బీసీసీఐని కోరాడు.
ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌కు లేఖ రాశాడు. బీసీసీఐ గుర్తింపు దక్కడం వారి కృషికి మెచ్చుకోలుగా ఉంటుందని, ఆటగాళ్ల ఆర్థిక భద్రతకూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నా డు. గత నెలలో అంధుల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని రాయ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment