సునీల్ సెంచరీ
భారత్‌కు ఆరో విజయం
అంధుల టి20 ప్రపంచకప్
కొచ్చి: సొంతగడ్డపై జరుగుతున్న అంధుల టి20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 128 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది ఆరో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 272 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ (72 బంతుల్లో 163 నాటౌట్; 29 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. మొహమ్మద్ ఫర్హాన్ (35 బంతుల్లో 53 రిటైర్డ్ హర్ట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి సునీల్, ఫర్హాన్ 15 ఓవర్లలో 199 పరుగులు జోడించారు.
ఆ తర్వాత క్రీజ్‌లో వచ్చిన ఇక్బాల్ జాఫర్ (13 బంతుల్లో 30 నాటౌట్)తో కలిసి సునీల్ చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు జతచేశారు. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్ర క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టగా... ఇక్బాల్, ప్రేమ్ ఒక్కో వికెట్ తీశారు. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ ఆరు విజయాలు సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.