రియో డీ జనీరో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ జరుగుతున్న రియో గ్రామంలో మంటల కలకలం రేగింది. రియో నగరానికి చివర ఉన్న డీయోడోరోలో మౌంటేన్ బైక్ ఈవెంట్లు, హాకీ మ్యాచ్లు జరుగుతున్న మైదానాల్లో బూడిద వ్యాపించడంతో మంటల ఘటన వెలుగుచూసింది. సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా చోటు చేసుకున్న కార్చిచ్చు కారణంగా బీఎంఎక్స్ సెంటర్ను ఉన్న పళంగా ఖాళీ చేయించారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. సుమారు 97 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే మంటలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో పాటు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో మంటల తీవ్రత బాగా పెరిగిపోయింది. గాలుల కారణంగా 65 అడుగుల ఎత్తులో ఉన్న కెమెరా ఒకటి ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మంటలు అదుపులోకి వచ్చినట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలియజేశారు.