మనోజ్ 'పంచ్' పడింది!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత బాక్సర్లు పతకంపై ఆశలు పెంచుతున్నారు. ఇప్పటికే బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి క్వార్టర్స్కు చేరగా, తాజాగా మరో బాక్సర్ మనోజ్ కుమార్ కూడా ప్రి క్వార్టర్స్కు అర్హత సాధించాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన బౌట్లో 64 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో మనోజ్ కుమార్ 2-1 తేడాతో గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్(లూథియానా)పై విజయం సాధించాడు.
మూడు రౌండ్ల పాటు జరిగిన పోరులో మనోజ్ కుమార్ పదునైన పంచ్లతో అదరగొట్టాడు. ప్రత్యేకంగా తొలి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబరిచిన మనోజ్ కుమార్.. చివరి రౌండ్ లో ఎక్కువగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. దీంతో ముగ్గురు జడ్జిల నిర్ణయంలో కేవలం ఒక పాయింట్ ను (29-28, 29-28, 28-29) మాత్రమే చేజార్చుకుని తదుపరి రౌండ్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్లో ఆరంభంలోనే మన బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైనప్పటికీ వారు అంచనాలు మించి రాణించడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
అంతకుముందు పురుషుల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ ప్రి-క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. అమెరికన్ చార్లెస్ కాన్వెల్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 3-0తో వికాస్ గెలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన వికాస్.. రైట్ స్ట్రయిట్స్, అప్పర్ కట్స్‌తో ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసి విజయాన్నికైవసం చేసుకున్నాడు.