
ఆసుపత్రిలో చేరిన మహ్మద్ అలీ
లూయిస్‌విల్లే (కెంటకీ): న్యూమోనియా కారణంగా బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బాక్సర్ అధికార ప్రతినిధి బాబ్ గునెల్ తెలిపారు. ఇప్పటికే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 72 ఏళ్ల అలీకి డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందన్నారు. ‘శనివారం ఉదయం అలీ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప స్థాయిలో న్యూమోనియా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు’ అని గునెల్ పేర్కొన్నారు. అయితే అలీ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బాక్సర్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వివరాలను వెల్లడించలేదు.
లూయిస్‌విల్లేలో సెప్టెంబర్‌లో జరిగిన ‘మహ్మద్ అలీ హుమానిటేరియన్’ అవార్డుల కార్యక్రమంలో చివరిసారి కనిపించిన బాక్సర్... ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో అలీ ఈ కార్యక్రమానికి హాజరైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 1981లో బాక్సింగ్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన అలీ... 2005లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెన్షియల్ మెడల్’ను స్వీకరించారు.