బ్రాడ్‌మన్, సచిన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు 14 క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రోజు. ఓ దిగ్గజ ఆటగాడి శకం ముగియగా.. మరో దిగ్గజ ఆటగాడు ప్రపంచానికి పరిచయమయ్యాడు. క్రికెట్ చరిత్రలో ఒకరు తనదైన ముద్ర వేయగా.. మరొకరు పరుగుల సునామీ సృష్టించారు. ఒకరు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ అయితే మరొకరు టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. కాకతాళియమో యాదృచికమో కానీ బ్రాడ్‌మన్ వీడ్కోలు పలికిన ఆగస్టు14నే సచిన్ తన తొలి సెంచరీ సాధించడం విశేషం.
1948 ఆగస్టు 14 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్. ఐదు టెస్టుల సిరీస్ అప్పటికే ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉంది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను పర్యాటక జట్టు 52 పరుగులకే కుప్పకూల్చింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. 117 పరుగుల వద్ద ఆసీస్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం దిగ్గజ బ్రాడ్‌మన్ ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం వారి క్యాప్‌లను తీసి గౌరవ సూచకంగా స్వాగతం పలికారు.
కెరీర్‌లో అతని చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఎరిక్ హొల్లీస్ బౌలింగ్‌లో తొలి బంతి ఎదుర్కొన్న బ్రాడ్‌మన్ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మైదానమంతా మూగబోయింది. దిగ్గజ ఆటగాడి కథ ముగిసింది. అప్పటి వరకు ప్రేక్షకులను అలరించిన బ్రాడ్‌మన్ బ్యాట్.. అతని చివరి మ్యాచ్‌లో మూగబోయింది. కేవలం 4 పరుగులు చేస్తే టెస్టుల్లో 100 సగటు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ గుర్తింపు పొందేవాడు. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సైతం 188 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్ ఇన్నింగ్స్,149 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో బ్రాడ్‌మన్‌కు మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేవలం 52 టెస్టుల మాత్రమే ఆడిన బ్రాడ్‌మన్ 99.94 సగటుతో 6,996 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు,13 అర్థ సెంచరీలు ఉండటం విశేషం.
సచిన్ మొదలెట్టాడు..
బ్రాడ్‌మన్ బ్యాట్ మూగబోయిన 42 ఏళ్ల అనంతరం1990 ఆగస్టు 14నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన శతకాల ఖాతాను తెరిచాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించిన ఈ టీనేజీ కుర్రాడు.. ఓటమి గండం నుంచి జట్టును గటెక్కించాడు. దిగ్గజ క్రికెటర్లు తడబడినా.. ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డెవాన్ మెక్ కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్ మెన్ తడబడ్డారు. సిద్ధు డకౌట్ కాగా.. రవిశాస్త్రి 12 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 50 రన్స్ చేసిన పెవిలియన్ చేరారు.
వెంగ్ సర్కార్ కూడా 32 పరుగులకే అవుటయ్యాడు. 109 పరుగులకే 4 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ అద్భుతంగా రాణించాడు. 11 పరుగులు చేసి కెప్టెన్ అజారుద్దీన్ అవుటైనా.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడంతో సచిన్‌కు లైఫ్ వచ్చింది. అది మొదలు అతడు వెనుదిరిగి చూడలేదు.. 189 బంతులను ఓపికగా ఎదుర్కొన్న సచిన్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 67 రన్స్‌తో మనోజ్ ప్రభాకర్ మాస్టర్‌కు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆ మ్యాచ్‌లో గవాస్కర్ ఇచ్చిన పాత ప్యాడ్లను కట్టుకుని సచిన్ బరిలో దిగిడం విశేషం. 17 ఏళ్ల 112 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు సచినే కావడం విశేషం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఇక ప్రపంచ క్రికెట్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు పాక్ క్రికెటర్ ముస్తాఖ్ మహ్మద్ గుర్తింపు పొందాడు. అతడు 17 ఏళ్ల 80 రోజుల వయసులో శతకం బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment