'మా క్రికెట్ను మరింత వెనక్కి నెట్టింది'
ఆంటిగ్వా: గత కొన్నిరోజుల క్రితం క్రికెటర్ డారెన్ బ్రేవోపై సస్పెన్షన్ వేటు వేస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తీవ్రంగా తప్పుబట్టాడు. తమ దేశ క్రికెట్ వెనక్కిపోవడానికి ఈ తరహా చర్యలే కారణమంటూ ధ్వజమెత్తాడు. ప్రతీ విషయాన్ని వివాదాస్పద కోణంలో చూడటం విండీస్ బోర్డుకు సాధారణంగా మారిపోయిందంటూ విమర్శించాడు.
'ఈ తరహా వేటు ఆమోదయోగ్యం కాదు. ప్రతీసారి పలు అంశాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని విడిచిపెట్టకతప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనవరసర రాద్దాంతాలు అనవసరం అని అనుకుంటున్నా. బ్రేవో వివాదం వెస్టిండీస్ క్రికెట్ సంస్కృతిని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. పరిస్థితి బాగుందీ అనుకునే లోపే, మళ్లీ మొదటకొస్తుంది. ఇలా అయితే మన క్రికెట్ లో పురోగతి ఎలా సాధిస్తాం'అని రిచర్డ్స్ ప్రశ్నించాడు.
‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదం డారెన్ బ్రేవోపై వేటకు కారణమైన సంగతి తెలిసిందే. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. నాలుగేళ్లలో డేవ్ చేసింది ఏమీ లేదంటూ విమర్శించాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
ఆ క్రమంలోనే ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు.