Darren Bravo
-
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..
వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డారెన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందిన బ్రావో.. వెస్టిండీస్ క్రికెట్‌తో తెగదింపులు చేసుకున్నాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రావో ఆదివారం వెల్లడించాడు. కాగా బ్రావో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ టోర్నీల్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన విండీస్ సూపర్-50 కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రావో నిలిచాడు. గత కొన్నేళ్లుగా దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. సెలక్టర్లు తన పట్టించుకోకపోవడంపై అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే విండీస్ క్రికెట్‌కు బ్రావో గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో సోదరుడే ఈ డారెన్ బ్రావో. "క్రికెటర్‌గా నా తదుపరి ప్రయాణం గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నాను. అన్ని విధాలగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. విండీస్ క్రికెట్‌తో నా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడానికి అన్ని విధాల కష్టపడ్డాను. కానీ విండీస్ సెలక్షన్ కమిటీ మాత్రం నాతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి 40 నుంచి 45 మంది ఆటగాళ్లు అవసరం. అందులో నేను లేనని నాకు అర్ధమైపోయింది. ప్రాంతీయ టోర్నీల్లో పరుగులు సాధించినా సెలెక్టర్లు నన్ను పక్కన పెట్టేశారు. అయితే నేను పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదు. కొంతకాలం పాటు దూరండా ఉండటం ఉత్తమమని భావిస్తున్నాను. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలి. ప్రతీ ఒక్కరికి ఆల్‌ది బెస్ట్" అని ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రావో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20ల కోసం డిసెంబర్లో వెస్టిండీస్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో విండీస్ సెలక్టర్లు తొలుత వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించారు. విండీస్ వన్డే జట్టు : షై హోప్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యన్నిక్ కరియా, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రన్ హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోటీ, జొర్న్ ఒట్లే, షెర్ఫనే రూథర్‌ఫర్డ్, రొమరియో షెఫర్డ్, ఒషానే థామస్. -
దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్
నార్త్ సౌండ్: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. హసరంగ (80 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాషెన్ బండార (55 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం విండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసి గెలిచింది. ఐదేళ్ల తర్వాత డారెన్ బ్రావో (102; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వన్డేల్లో మరో సెంచరీ సాధించాడు. షై హోప్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రావో... షై హోప్‌తో మూడో వికెట్‌కు 109 పరుగులు, పొలార్డ్‌తో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షై హోప్ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో కనీసం అర్ధ సెంచరీ చేసిన పదో క్రికెటర్‌గా, విండీస్ నుంచి గార్డన్ గ్రీనిడ్జ్, క్రిస్ గేల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: టీమిండియాకు జరిమానా.. కోవిడ్ తర్వాత మూడోసారి -
క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బౌలర్ షానన్ గాబ్రియేల్ సహచరు క్రికెటర్ డారెన్ బ్రావోపై నోరు పారేసుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ హెన్రీ నికోలస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న బ్రావో జారవిడిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గాబ్రియేల్ బ్రావోనుద్దేశించి 'ఫక్ యూ..' అనే అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయం స్టంపింగ్ మైక్‌లో రికార్డు అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వెల్లింగ్టన్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అలా గాబ్రియేల్ బౌలింగ్‌లో 47 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నికోలస్ ఆ తర్వాత 174 పరుగులు చేసి తన టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం క్యాచ్ వదిలేసినందుకు ఎవరైనా ఇలా తిడతారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : పుట్టినరోజునాడే యువీ ఎమోషనల్ ట్వీట్) ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఫేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో అన్ని రకాలుగా తేలిపోయింది. మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెన్రీ నికోలస్ 174 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో 42 బంతుల్లోనే 66 పరుగులు చేసిన బౌలర్ వాగ్నర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. జోషు దా సిల్వ, చేమర్ హోల్డర్ క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లో కైల్ జేమిసన్ 5 వికెట్లతో చెలరేగగా.. సౌతీ 3 వికెట్లతో రాణించాడు.(చదవండి : 'పేడ మొహాలు,చెత్త గేమ్‌ప్లే అంటూ..') 🔊 Volume up for this one! Fair to say that Shannon Gabriel wasn't too happy with Darren Bravo today 😂🤬 #NZvWI pic.twitter.com/eWBCpA5vKr — Aaron Murphy (@AaronMurphyFS) December 11, 2020 -
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లలేం
సెయింట్ జాన్స్: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం తాము ఇంగ్లండ్‌లో పర్యటించబోమని వెస్టిండీస్ ఆటగాళ్లు డారెన్ బ్రేవో, షిమ్రోన్ హెట్‌మైర్, కీమో పాల్ వెల్లడించారు. దాంతో ఈ సిరీస్ కోసం ఈ ముగ్గురి పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా 14 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఎన్క్రుమా బోనెర్, పేస్ బౌలర్ చెమర్ హోల్డర్ తొలిసారి విండీస్ టెస్టు జట్టులోకి వచ్చారు. బయో–సెక్యూర్ పరిస్థితుల నడుమ నిర్వహించే ఈ సిరీస్ కోసం ఎంపికైన ఆటగాళ్లందరికీ కోవిడ్–19 టెస్టులు చేస్తారు. అనంతరం జూన్ 8న చార్టెర్డ్ ఫ్లయిట్లో విండీస్ క్రికెటర్లు ఇంగ్లండ్‌కు బయలుదేరుతారు. తొలి టెస్టును హాంప్‌షైర్‌లో జూలై 8 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. అనంతరం రెండో టెస్టు జూలై 16 నుంచి 20 వరకు... మూడో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరుగుతాయి. విండీస్ టెస్టు జట్టు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, షై హోప్, డౌరిచ్, రోస్టన్ చేజ్, షెమారా బ్రూక్స్, రఖీమ్ కార్న్‌వాల్, ఎన్క్రుమా బోనెర్, అల్జారి జోసెఫ్, చెమర్ హోల్డర్, జాన్ క్యాంప్‌బెల్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జెర్మయిన్ బ్లాక్‌వుడ్. -
టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం!
కింగ్స్టన్: భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు సందర్భంగా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక విశేషం చోటు చేసుకుంది. జట్టు తరఫున 12 మంది బ్యాటింగ్‌కు దిగిన ఘటన రెండో టెస్టులో జరిగింది. ‘కన్కషన్’ కారణంగా డారెన్ బ్రేవో రెండో ఇన్నింగ్స్‌లో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో అతని స్థానంలో వచ్చిన సబ్‌స్టిట్యూట్ జెర్మయిన్ బ్లాక్‌వుడ్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 12 మంది బ్యాటింగ్ చేసినట్లయింది. కాగా ఇటీవలే యాషెస్ సిరీస్‌లో స్మిత్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన లబ్‌షేన్ తొలి ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బరిలోకే దిగలేదు కాబట్టి ఆసీస్ బ్యాటింగ్ 11 మందికే పరిమితమైంది. చదవండి : రెండో టెస్టులోనూ విండీస్ చిత్తు..సిరీస్ కైవసం ఇక మ్యాచ్ మూడో రోజు బుమ్రా వేసిన చివరి ఓవర్ నాలుగో బంతి బ్రేవో హెల్మెట్‌కు బలంగా తాకింది. అతని నెక్ గార్డ్లు కూడా ఊడిపడ్డాయి. ఫిజియో చికిత్స అనంతరం బ్రేవో మిగిలిన రెండు బంతులు ఆడి ఆటను ముగించాడు. మరుసటి రోజు మరో పది బంతులు కూడా ఎదుర్కొన్నాడు. అయితే అనూహ్యంగా అతనికి మగతగా అనిపించి ఇక ఆడలేనంటూ మైదానం వీడాడు. వైద్య పరీక్షల అనంతరం బ్రేవోకు బదులుగా సబ్‌స్టిట్యూట్ బ్యాటింగ్ చేసేందుకు రిఫరీ అనుమతించారు. కాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. 257 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుది. భారత బౌలర్లు విజృంభించడంతో 468 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టును మట్టి కరిపించిన టీమిండియా ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
తెర పైకి క్రికెటర్ బ్రావో
తక్కువ కాలంలోనే మంచి కాంబినేషన్‌తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను ఎనౌన్స్ చేశారు. అది కూడా ప్రముఖ వెస్టీండీస్ ఆల్‌రౌండర్ డారెన్ బ్రావోతో కావడం విశేషం. ప్రస్తుతం సమంత ముఖ్యపాత్రలో ‘ఓ బేబి’, వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ చిత్రాన్ని నిర్మిస్తోందీ సంస్థ. అలాగే అనుష్క, మాధవన్ కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘డారెన్ బ్రావోతో ఓ షార్ట్ ఫిలింను ప్లాన్ చేశాం’’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా శనివారం బ్రావో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒప్పందం జరిగింది. కోయంబత్తూర్, తమిళనాడు, వెస్ట్ండీస్లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు, టి.జి.విశ్వప్రసాద్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్లై పాల్గొన్నారు. -
విండీస్‌కు ఆధిక్యం
నార్త్‌సౌండ్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రేవో (216 బంతుల్లో 50; 2 ఫోర్లు, 1 సిక్స్) అపరిమిత సహనంతో నిలిచి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. అతడికి... డౌరిచ్ (31), కెప్టెన్ హోల్డర్ (22) సహకరించడంతో మూడో రోజు లంచ్‌కు ముందు విండీస్ 306 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (49), కాంప్‌బెల్ (47), షైహోప్ (44) రాణించారు. దీంతో ఆతిథ్య జట్టుకు 119 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కడపటి వార్తలు అందేసరికి 3 వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేసింది. మరో 60 పరుగులు వెనుకబడి ఉంది. శనివారం తల్లి చనిపోయిన బాధను దిగమింగి విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ బ్యాటింగ్‌కు దిగడం అందరినీ కదిలించింది. -
10 బంతులు.. ఆరు సిక్సర్లు!
సెయింట్ కిట్స్: ట్వంటీ 20 క్రికెట్ లో విధ్వంసకర ఆట తీరు ఎలా ఉండాలో మరోసారి రుచి చూపించారు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్, వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రేవోలు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ 20లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డారెన్ బ్రేవో 10 బంతుల్లో ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడగా, మెకల్లమ్ 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. బ్రేవో అజేయంగా 38 పరుగులు, మెకల్లమ్ 40 నాటౌట్ లు విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాట్రియాట్స్ 13 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(93;47 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. అయితే ఆపై ట్రింబాగో నైట్ రైడర్స్ ఆటగాళ్లు మెకల్లమ్, బ్రేవో దాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి జోరుకు 5.2 ఓవర్లలో (డక్ వర్త్ లూయిస్) రెండు వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ 88 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రధానంగా చివరి 13 బంతుల్లో మెకల్లమ్, బ్రేవోలు ఇద్దరూ కలిపి ఎనిమిది సిక్సర్లు సాధించడంతో నైట్ రైడర్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. -
'మా క్రికెట్‌ను మరింత వెనక్కి నెట్టింది'
ఆంటిగ్వా: గత కొన్నిరోజుల క్రితం క్రికెటర్ డారెన్ బ్రేవోపై సస్పెన్షన్ వేటు వేస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తీవ్రంగా తప్పుబట్టాడు. తమ దేశ క్రికెట్ వెనక్కిపోవడానికి ఈ తరహా చర్యలే కారణమంటూ ధ్వజమెత్తాడు. ప్రతీ విషయాన్ని వివాదాస్పద కోణంలో చూడటం విండీస్ బోర్డుకు సాధారణంగా మారిపోయిందంటూ విమర్శించాడు. 'ఈ తరహా వేటు ఆమోదయోగ్యం కాదు. ప్రతీసారి పలు అంశాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటిని విడిచిపెట్టకతప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనవరసర రాద్దాంతాలు అనవసరం అని అనుకుంటున్నా. బ్రేవో వివాదం వెస్టిండీస్ క్రికెట్ సంస్కృతిని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. పరిస్థితి బాగుందీ అనుకునే లోపే, మళ్లీ మొదటకొస్తుంది. ఇలా అయితే మన క్రికెట్ లో పురోగతి ఎలా సాధిస్తాం'అని రిచర్డ్స్ ప్రశ్నించాడు. ‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదం డారెన్ బ్రేవోపై వేటకు కారణమైన సంగతి తెలిసిందే. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. నాలుగేళ్లలో డేవ్ చేసింది ఏమీ లేదంటూ విమర్శించాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆ క్రమంలోనే ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. -
కీలక బ్యాట్స్ మన్ పై వేటు
సెయింట్ జాన్స్: కీలక బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీబీ) షాక్ ఇచ్చింది. ‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదంతో అతడిపై వేటు వేసింది. జింబాబ్వేలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఫలితంగా బ్రావోపై వేటు పడింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ జాసన్ మహ్మద్ ను జట్టులోకి తీసుకున్నారు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. వ్యక్తిగత కారణాలతో వైదొలగిన సునీల్ నరైన్ స్థానంలో బిషూను తీసుకున్నారు. -
ఫైనల్లో వెస్టిండీస్
► ముక్కోణపు వన్డే టోర్నీ ► ఆఖరి లీగ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం ► డారెన్ బ్రేవో సెంచరీ బ్రిడ్జిటౌన్: సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో వెస్టిండీస్ ఫైనల్‌కు చేరింది. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ 100 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటిం గ్ చేసిన వెస్టిండీస్ 49.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటయింది. డారెన్ బ్రేవో (103 బంతుల్లో 102; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను... బ్రేవో, పొలార్డ్ (71 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్‌కు 156 పరుగులు జోడించి ఆదుకున్నారు. హోల్డర్ (46 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), బ్రాత్‌వైట్ (42 బంతు ల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. రబడ, మోరిస్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా జట్టు 46 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటయింది. బెహర్డీన్ (57 బంతు ల్లో 35; 4 ఫోర్లు), మోర్కెల్ (47 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) మినహా ఎవరూ కుదురుగా ఆడలేదు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్ (3/17), నరైన్ (3/28) రాణించారు. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
వెస్టిండీస్ 121/7
రోసీయూ: ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ కుప్పకూలింది. కడపటి వార్తలందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. షై హోప్ (36)దే అత్యధిక స్కోరు. బ్రాత్‌వైట్ (10), డారెన్ బ్రేవో (19), శామ్యూల్స్ (7), బ్లాక్‌వుడ్ (2), రామ్‌దిన్ (19) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కగా, జాన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ద్వారా ఆడమ్ వోజెస్ (ఆసీస్), షేన్ డౌరిచ్ (విండీస్) టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. -
రికార్డుల మోత
సెంచరీలతో చెలరేగిన రామ్‌దిన్, బ్రేవో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ బస్సేటెర్రె (సెయింట్ కిట్స్): దినేశ్ రామ్‌దిన్ (121 బంతుల్లో 169; 8 ఫోర్లు, 11 సిక్సర్లు), డారెన్ బ్రేవో (127 బంతుల్లో 124, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బస్సేటెర్రెలో సోమవారం జరిగిన మూడో వన్డేలో 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిం ది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
రికార్డు భాగస్వామ్యంతో అదరగొట్టారు
బాస్సెటెరీ: బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0తో వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో విండీస్ 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో రికార్డు భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. మూడో వికెట్ కు వీరిద్దరు 258 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వన్డేల్లో విండీస్ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అత్యుత్తమ భాగస్వామాల్లో ఇది ఐదో అతి పెద్దది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. బ్రేవో(124), రామ్‌దిన్(169) సెంచరీలతో చెలరేగారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ సిరీస్ రెండూ రామ్‌దిన్ దక్కించుకున్నాడు. -
డారెన్ బ్రేవో ద్విశతకం
డునెడిన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫాలోఆన్‌లో పడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దీటుగా ఆడుతోంది. డారెన్ బ్రేవో (404 బంతుల్లో 210 బ్యాటింగ్; 30 ఫోర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 139 ఓవర్లలో 6 వికెట్లకు 443 పరుగులు చేసింది. బ్రేవోతో పాటు స్యామీ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం కరీబియన్ జట్టు 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు. ఆఖరి రోజు కివీస్ బౌలర్లు విండీస్‌ను తొందరగా ఆలౌట్ చేస్తే ఆ జట్టుకు విజయా వకాశాలు ఉంటాయి. 168/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శామ్యూల్స్ (23), చందర్‌పాల్ (1) వెంటవెంటనే అవుటైనా... బ్రేవో మాత్రం మూడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. దేవ్‌నారాయణ్ (52)తో ఐదో వికెట్‌కు 122 పరుగులు... రామ్‌దిన్ (24)తో కలిసి ఆరో వికెట్‌కు 56 పరుగులు; స్యామీతో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 80 పరుగులు జోడించాడు. జీవంలేని వికెట్‌పై బ్రేవో అద్భుతమైన టెక్నిక్‌తో ఆడగా... కివీస్ ఫీల్డర్లు క్యాచ్‌లను మిస్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. 82 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్రేవో క్యాచ్‌ను వాగ్నేర్ జారవిడవగా... 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవ్‌నారాయణ్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్లో మెకల్లమ్ వదిలేశాడు. సోధి 2, సౌతీ, బౌల్ట్, వాగ్నేర్, అండర్సన్ తలా ఓ వికెట్ తీశారు. -
విండీస్ ఫాలోఆన్
డునెడిన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిం డీస్ ఫాలోఆన్‌లో పడింది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (72 బ్యాటింగ్), శామ్యూల్స్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ ఇంకా 228 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 67/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ టిమ్ సౌతీ (4/42), బౌల్ట్ (3/40) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 396 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చందర్‌పాల్ (76) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అర్ధసెంచరీ సాధించిన చందర్‌పాల్ టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.