10 బంతులు.. ఆరు సిక్సర్లు!
సెయింట్ కిట్స్: ట్వంటీ 20 క్రికెట్ లో విధ్వంసకర ఆట తీరు ఎలా ఉండాలో మరోసారి రుచి చూపించారు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్, వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రేవోలు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ 20లో భాగంగా ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డారెన్ బ్రేవో 10 బంతుల్లో ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడగా, మెకల్లమ్ 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. బ్రేవో అజేయంగా 38 పరుగులు, మెకల్లమ్ 40 నాటౌట్ లు విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాట్రియాట్స్ 13 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(93;47 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. అయితే ఆపై ట్రింబాగో నైట్ రైడర్స్ ఆటగాళ్లు మెకల్లమ్, బ్రేవో దాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి జోరుకు 5.2 ఓవర్లలో (డక్ వర్త్ లూయిస్) రెండు వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ 88 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రధానంగా చివరి 13 బంతుల్లో మెకల్లమ్, బ్రేవోలు ఇద్దరూ కలిపి ఎనిమిది సిక్సర్లు సాధించడంతో నైట్ రైడర్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.