ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని... గెలవాల్సిన మ్యాచ్‌నూ ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన బ్రెజిల్‌కు తెలిసొచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ ‘ఇ’లో స్విటర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను బ్రెజిల్ ‘డ్రా’గా ముగించింది. ఫలితంగా 1978 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో బ్రెజిల్‌కు విజయం దక్కకుండా పోయింది.
రొస్టావ్–ఆన్–డాన్ (రష్యా): మరో మేటి జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న మాజీ చాంపియన్ బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టిపోటీ ఎదురైంది. ఫలితంగా గ్రూప్ ‘ఇ’లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను బ్రెజిల్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ తొలి అర్ధభాగంలో స్థాయికి తగ్గట్టు ఆడినా... రెండో అర్ధభాగంలో మాత్రం నిరాశపరిచింది. బ్రెజిల్ తరఫున ఆట 20వ నిమిషంలో ఫిలిప్ కుటినో గోల్ చేయగా... 50వ నిమిషంలో స్టీవెన్ జుబెర్ ‘హెడర్’ గోల్‌తో స్విట్జర్లాండ్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆరంభ నిమిషాల్లో ఫార్వర్డ్ శ్రేణిలో నెమార్, జీసస్, విలియన్‌లతో బ్రెజిల్ ఎడతెరిపి లేకుండా దాడులు చేసింది. ఎట్టకేలకు 20వ నిమిషంలో వారి ప్రయత్నం ఫలించింది. కుటినో కళ్లు చెదిరే కిక్‌తో స్విస్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి బ్రెజిల్ ఖాతా తెరిచాడు. విరామ సమయానికి బ్రెజిల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
రెండో అర్ధభాగంలో స్విట్జర్లాండ్ దూకుడు పెంచింది. ఐదు నిమిషాల్లోనే వారి వ్యూహం ఫలితాన్ని ఇచ్చింది. 50వ నిమిషంలో లభించిన కార్నర్‌ను జెర్డాన్ షకిరి ‘డి’ ఏరియా గోల్‌పోస్ట్ ముందువైపు కొట్టగా ఏడుగురు బ్రెజిల్ డిఫెండర్ల మధ్యలో ఉన్న స్టీవెన్ జుబెర్ అందర్నీ బోల్తా కొట్టించి గాల్లోకి ఎగిరి హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. స్కోరు సమం చేశాక స్విట్జర్లాండ్ వేగం తగ్గించి బ్రెజిల్‌ను నిలువరించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్‌ను స్విట్జర్లాండ్ ఆటగాళ్లు టార్గెట్ చేశారు. అతడిని ఏకంగా 10 సార్లు మొరటుగా అడ్డుకున్నారు. స్విస్ రక్షణశ్రేణి అప్రమత్తంగా ఉండటంతో 77వ నిమిషం వరకు బ్రెజిల్ ఆటగాళ్లు గోల్ పోస్ట్‌వైపు షాట్‌లు సంధించకపోవడం గమనార్హం. చివర్లో బ్రెజిల్‌కు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా ఫినిషింగ్ లోపంతో అవి వృథా అయ్యాయి.
చాంపియన్ జట్లకు చుక్కలు...
ప్రత్యర్థి చిన్నదైనా, ఓ స్థాయిదైనా ప్రస్తుత ప్రపంచ కప్‌లో ‘చాంపియన్’ జట్లకు మాత్రం తొలి రౌండ్‌లో మింగుడుపడని పరిణామాలే మిగులుతున్నాయి. అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీలాంటి మేటి జట్లకు ఎదురైన ఫలితాలే దీనికి నిదర్శనం. సమఉజ్జీలైన స్పెయిన్–పోర్చుగల్ మ్యాచ్ ‘డ్రా’ కావడాన్ని సర్దిచెప్పుకొన్నా... అర్జెంటీనా, బ్రెజిల్ తమకంటే ఎంతో చిన్నవైన ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్‌లపై ‘డ్రా’తో బయటపడి ఊపిరి పీల్చుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ఏకంగా మెక్సికో చేతిలో ఓడింది. ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ గెలిచినా, అందులో కొత్తగా ప్రవేశపెట్టిన వీఏఆర్ సాంకేతికత పాత్రను విస్మరించలేం. ఉరుగ్వే కూడా శ్రమించి ఈజిప్ట్‌ను ఓడించింది. గమనార్హమేమంటే ప్రధాన జట్లన్నీ తమ ప్రత్యర్థులకు ఒక్కో గోల్ ఇచ్చుకున్నాయి. జర్మనీనే ప్రతిగా గోల్ చేయలేక మ్యాచ్‌ను అప్పగించేసింది. ట్యూనీషియాతో ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం కూడా భిన్నంగా లేకుంటే... నిజంగా మాజీ చాంపియన్లకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లే.
Comments
Please login to add a commentAdd a comment