బ్రెజిల్‌ ఢమాల్‌   | Belgium out-tactic Brazil to reach semi-finals | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ ఢమాల్‌  

Published Sun, Jul 8 2018 1:24 AM | Last Updated on Sun, Jul 8 2018 1:24 AM

 Belgium out-tactic Brazil to reach semi-finals - Sakshi

మాజీ చాంపియన్లకు ఈ ప్రపంచకప్‌  ఓ పీడకలేనేమో! లీగ్‌ దశలో జర్మనీ..! ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, స్పెయిన్‌..! క్వార్టర్స్‌లో ఉరుగ్వే, బ్రెజిల్‌..! ఇలా ఒక్కోటి వరుసగా ఇంటి ముఖం పడుతున్నాయి! ఇందులో మిగతావాటి సంగతెలా ఉన్నా... ఐదుసార్లు విజేతైన బ్రెజిల్‌ది మాత్రం స్వయంకృతమే. టోర్నీలో భీకరంగా ఆడకపోయినా, పుంజుకుంటున్నట్లు కనిపించిన సాంబా జట్టు... నాకౌట్‌ మ్యాచ్‌ల్లో చేయకూడని పొరపాటు చేసి బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. అంతకు కొన్ని గంటల క్రితమే ఉరుగ్వే నిష్క్ర మించగా, బ్రెజిల్‌ కూడా వెనుదిరగడంతో వరుసగా నాలుగోసారి సైతం కప్‌ యూరప్‌ దేశాల ఖాతాలో చేరడం ఖాయమైంది.  

కజన్‌: అసలే ప్రత్యర్థి జోరుమీదుంది. ఏమాత్రం వీలు చిక్కినా మింగేసేలా ఆడుతోంది. అలాంటి దానికి పైచేయి సాధించే అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉంటుందా? బెల్జియంతో శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌ ఇలాగే ఆడి చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. మ్యాచ్‌లో బంతిపై 57 శాతం నియంత్రణ కనబర్చినా, ప్రత్యర్థి కంటే రెండు రెట్లు దాడులు ఎక్కువగానే చేసినా... ఫెర్నాండిన్హో (13వ నిమిషం) సెల్ఫ్‌ గోలే సాంబా బృందం కొంపముంచింది. ఆత్మరక్షణలో పడిన ఆ జట్టును... బెల్జియం మిడ్‌ ఫీల్డర్‌ డి బ్రుయెన్‌ (31వ ని.) రెండో గోల్‌తోమరింత దెబ్బకొట్టాడు. ప్రథమార్ధంలోనే 2–0తో వెనుకబడిన బ్రెజిల్‌కు ఆగస్టొ (76వ ని.) స్కోరు అందించినా, తర్వాత తీవ్రంగా ప్రతిఘటించినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో స్టార్‌ ఆటగాడు నెమార్‌ కొట్టిన షాట్‌ను రెడ్‌ డెవిల్స్‌ కీపర్‌ కోర్టొయిస్‌ చేతి కొనవేళ్లతో గోల్‌ పోస్ట్‌ పైకి పంపి... మాజీ చాంపియన్‌ను ఇంటి దారి పట్టించాడు. 

అదే దెబ్బకొట్టింది... 
ప్రారంభంలోనే బ్రెజిల్‌ డిఫెండర్‌ థియాగో సిల్వా కొట్టిన షాట్‌... గోల్‌ బార్‌ సమీపం నుంచి వెళ్లింది. సాంబా ఆటగాళ్ల దూకుడుతో బెల్జియం వెనుకంజ వేసింది. అయితే,  13వ నిమిషంలో ఆ జట్టుకే అదృష్టం కలిసొచ్చింది. విసెంట్‌ కంపానీ కార్నర్‌ కిక్‌ను తప్పించే క్రమంలో ఫెర్నాండిన్హో బంతిని తమ గోల్‌ పోస్ట్‌లోకే కొట్టుకున్నాడు. ఊహించని ఈ పరిణామాన్ని బ్రెజిల్‌ చాలాసేపు జీర్ణించుకోలేకపోయింది. ఆధిక్యం దక్కిన ఆనందంలో బెల్జియం ప్రతిదాడులతో ఒత్తిడి పెంచింది. డి బ్రుయెన్‌ పాస్‌ల నైపుణ్యం, లుకాకు వేగం, ఈడెన్‌ హజార్డ్‌ టెక్నిక్‌తో ప్రత్యర్థిని కట్టి పడేశారు. బ్రెజిల్‌ నష్ట నివారణకు చూస్తుండగా... 31వ నిమిషయంలో డి బ్రుయెన్‌ బుల్లెట్‌ షాట్‌తో ‘రెడ్‌ డెవిల్స్‌’కు గోల్‌ అందించాడు. ప్రత్యర్థులను తప్పిస్తూ మైదానం మధ్య నుంచి లుకాకు అందించిన పాస్‌ను... డి బ్రుయెన్‌ 20 గజాల దూరం నుంచి లక్ష్యానికి చేర్చాడు. రెండోభాగంలో బ్రెజిల్‌ తాడోపేడో అన్నట్లు ఆడింది. అయితే, నెమార్‌ను బెల్జియం కట్టడి చేసింది. దీంతో ఆగస్టొను సబ్‌స్టిట్యూట్‌గా పంపింది. 76వ నిమిషంలో కౌటిన్హొ క్రాస్‌ షాట్‌ను అతడు హెడర్‌ ద్వారా నెట్‌లోకి పంపి ఖాతా తెరిచాడు. సమయం ముగియనుండటంతో సాంబా జట్టు వరుసపెట్టి దాడులకు దిగినా గోల్‌ మాత్రం చేయలేకపోయింది.

►వరుసగా నాలుగో ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో యూరోప్‌ జట్టు చేతిలో బ్రెజిల్‌ ఓడిపోయింది. 2006లో ఫ్రాన్స్‌ చేతిలో... 2010లో నెదర్లాండ్స్‌ చేతిలో... 2014లో జర్మనీ చేతిలో ఓడింది. 

►ప్రస్తుత ప్రపంచకప్‌లో బెల్జియం తరఫున తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు గోల్‌ చేశారు. 2006లో ఇటలీ, 1982లో ఫ్రాన్స్‌ తరఫున అత్యధికంగా పది మంది వేర్వేరు ఆటగాళ్లు గోల్‌ చేశారు. 

►ప్రపంచకప్‌ చరిత్రలో బెల్జియం సెమీఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. తొలిసారి 1986లో సెమీస్‌ చేరిన  ఆ జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది.  

 ►ఓవరాల్‌గా బ్రెజిల్‌పై బెల్జియం నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 1963లో ఒకే ఒక్కసారి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను బెల్జియం ఓడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement