ప్రపంచ కప్ ప్రయాణాన్ని నిదానంగా ప్రారంభించినా, క్రమంగా తనదైన ఆటను బయటకు తీస్తోంది మాజీ చాంపియన్ ఫ్రాన్స్. లీగ్ దశను అజేయంగా ముగించి... ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌నే ఓడించిన ఉరుగ్వేను... క్వార్టర్ ఫైనల్లో అలవోకగా మట్టికరిపించి సెమీస్ బెర్తును కొట్టేసింది. స్టార్ స్ట్రయికర్ ఎడిన్సన్ కవానీ లేని లోటుతో పాటు... మరో స్టార్ లూయీజ్ సురెజ్ మెరుపులు కొరవడటంతో ఉరుగ్వే ఉసూరుమంటూ వెనుదిరిగింది.
నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులూ... కాచుకోండి! ఫ్రాన్స్ ఆట పదునెక్కుతోంది! మొదటి క్వార్టర్ ఫైనలే ఇందుకు నిదర్శనం! ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే ఉరుగ్వేను గుక్క తిప్పుకోనీయకుండా మట్టికరిపించిన తీరే దీనికి సాక్ష్యం! ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆంటోన్ గ్రీజ్‌మన్ ప్రతిభతో శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–0తో గెలుపొంది దర్జాగా సెమీస్‌లో అడుగు పెట్టింది. 40వ నిమిషంలో రఫెల్ వరెన్‌కు ఫ్రీ కిక్ పాస్ అందించి అతడు గోల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రీజ్‌మన్... 61వ నిమిషంలో స్వయం గా గోల్ కొట్టి జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. ఆటగాళ్ల దూకుడు, వరుస ఎల్లోకార్డులు, గోల్‌పోస్ట్ వద్ద పోరాటాలతో క్వార్టర్స్ మ్యాచ్ కొంత ఉత్కంఠ రేకెత్తించింది. ఓ దశ వరకు ఉరుగ్వే దీటుగానే కనిపించినా ఫినిషింగ్ లోపం వేధించింది. అందివచ్చిన ఒకటి, రెండు చక్కటి అవకాశాలను కాలదన్నుకున్న ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది.
సమంగా ప్రారంభమై...
అంతా భావించినట్లే ఉరుగ్వే రక్షణ శ్రేణి, ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి పోటీలా ప్రారంభమైంది మ్యాచ్. ప్రత్యర్థిని ఆశ్చర్యానికి గురిచేస్తూ సురెజ్, టొరీరాల వేగంతో ఉరుగ్వేకే మొదట అవకాశాలు దక్కాయి. అయితే అవి కొంత క్లిష్టమైనవి. బంతి ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయింది. ఎంబాపె, గ్రీజ్‌మన్, గిరౌడ్‌ల పాస్‌లను ఉరుగ్వే మధ్యలోనే అడ్డుకుంది. ఎంబాపెకు కొన్ని హెడర్‌లు వచ్చినా సఫలం చేయలేకపోయాడు. 38వ నిమిషంలో బెంటాన్‌కర్ ప్రత్యర్థి ఆటగాడిని అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు ఫ్రీకిక్ లభించింది. దీనిని కార్నర్ నుంచి గ్రీజ్‌మన్ షాట్ కొట్టగా... గోల్‌పోస్ట్ ముందున్న వరెన్ హెడర్‌తో నెట్‌లోకి పంపాడు. గాయంతో కవానీ దూరం కావడం సురెజ్ ప్రదర్శనపైనా ప్రభావం చూపింది. సరైన సహకారం కరవైన అతడు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేకపోయాడు.
రెండోభాగంలో రెండో గోల్...
ఆధిక్యం కోల్పోయిన ఉరుగ్వే రెండో భాగంలో దాడుల తీవ్రత పెంచేందుకు రొడ్రిగెజ్, గోమెజ్‌లను సబ్‌స్టిట్యూట్లుగా దింపింది. కానీ, పేలవమైన ఆటతో ఫ్రాన్స్‌కు గోల్ ఇచ్చింది. పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకున్న గ్రీజ్‌మన్ మరో ఆలోచన లేకుండా గోల్‌పోస్ట్ దిశగా కొట్టాడు. దీనిని ఉరుగ్వే ఆటగాళ్లెవరూ అడ్డుకోలేకపోగా... కీపర్ ముస్లెరా గోల్‌పోస్ట్ వద్ద తడబడ్డాడు. దారి మళ్లించే క్రమంలో అతడు విఫలమవడంతో బంతి గోల్ లైన్‌ను తాకింది. 2–0 ఆధిక్యం దక్కడంతో ఫ్రాన్స్ మిగతా సమయం ప్రశాంతంగా ఆడుకుంటూ పోయింది.ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఆరోసారి సెమీస్ చేరింది. 1958, 82, 86, 98, 2006లలోనూ సెమీస్ చేరిన ఫ్రాన్స్ 1998లో విజేతగా, 2006లో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు ఉరుగ్వేతో ఆడిన ఫ్రాన్స్ రెండోసారి మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఏకైకసారి 1986లో ఉరుగ్వేను ఫ్రాన్స్ ఓడించింది. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... రెండింటిలో ఓడిపోయింది.
ఫ్రాన్స్ ప్రతాపం...
Published Sat, Jul 7 2018 1:54 AM | Last Updated on Sat, Jul 7 2018 1:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment