బ్రెజిల్‌కు షాక్
సాంటియాగో: ప్రత్యర్థిపై వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం... గత 24 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడని చరిత్ర.. ప్రస్తుత ఫామ్ పరంగా చూసినా తమదే పైచేయి... అయినా కోపా అమెరికా కప్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 1-0తో బ్రెజిల్‌పై విజయం సాధించింది. దీంతో గతేడాది జరిగిన ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్‌ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కొలంబియా డిఫెండర్ జీసన్ మురిలో (36వ ని.) కొలంబియాకు ఏకైక గోల్ అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ మొరటుగా ఆడితే.. పక్కా ప్రణాళికతో కొలంబియా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 36వ నిమిషంలో రైట్ ఫ్లాంక్ నుంచి కడ్రాడో కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్ ముందర డ్రాప్ అయ్యింది. అయితే అక్కడే ఉన్న మురిలో నేర్పుగా బంతిని అందుకుని లో షాట్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపడంతో బ్రెజిల్ నివ్వెరపోయింది. రెండో అర్ధభాగంలోబ్రెజిల్ అటాకింగ్‌ను మరింత పెంచింది. చివరి వరకు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు.
నెయ్‌మార్‌కు రెడ్ కార్డ్
మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కొలంబియా ఆటగాళ్లు రెచ్చగొట్టినా.. మ్యాచ్‌లో ఓపికగా ఉన్న స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ మ్యాచ్ ముగిశాక అదుపుతప్పాడు. ఒక్కసారిగా గోల్ స్కోరర్ మురిలోను తలతో బాదాడు. దీంతో రెచ్చిపోయిన కొలంబియా ఆటగాళ్లు బ్రెజిల్ ప్లేయర్లపై తిరగబడ్డారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకున్నారు. సంఘటనకు కారకుడైన నెయ్‌మార్‌కు రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చారు. కొలంబియా స్ట్రయికర్ బాకా కూడా రెడ్‌కార్డుకు గురయ్యాడు.