మెకల్లమ్ ద్విశతకం; కివీస్కు భారీ ఆధిక్యం
వెల్లింగ్టన్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టుబిగిచింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డబుల్ సెంచరీ, వాట్లింగ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 252/5 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన కివీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 571/6 స్కోరు చేసింది. దీంతో న్యూజిలాండ్కు 325 పరుగుల ఆధిక్యం లభించింది.
మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్కు 355 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ కోలుకుంది. వాట్లింగ్(124)ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మరో వికెట్ పడకుండా కివీస్ జాగ్రత్త పడింది. మెకల్లమ్ ట్రిఫుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ట్రిఫుల్ సెంచరీ చేసే వరకు ఆగుతాడా లేక మ్యాచ్ ను ముందే డిక్లేర్ చేస్తాడా అనేది మంగళవారం తేలుతుంది. మెకల్లమ్ 281, నిషామ్ 67 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. చివరి రోజు ఏదైనా సంచలనం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. తొలి ఇన్నింగ్స్లో కివీస్ 192, భారత్ 438 పరుగులు చేశాయి.